తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీలో… టీఆర్ఎస్ సర్కార్ పై పోరాడటం కన్నా… పార్టీలో ఎదుగుతున్న రేవంత్ ను ఎలా కట్టడి చేయాలన్నదానిపైనే ఎక్కువగా చర్చ జరిగింది. హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని ఉత్తమ్ ప్రకటించుకున్నారు. అయితే..ఈ వైఫల్యాన్ని ఎవరూ ప్రశ్నించకుండా ఉత్తమ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ తర్వాత వెంటనే… పరోక్షంగా పార్టీలో రేవంత్ ను ఎలా కట్టడి చేయాలన్న అంశంపైనే చర్చించారు. క్రమశిక్షణ పేరుతో రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి మాట్లాడారు. వైఎస్ కూడా ఎప్పుడూ సీఎం కాకముందు తన కార్యకర్తలతో సీఎం అనిపించుకోలేదని కానీ పార్టీ లో ఓక నేత సభలు , సమావేశాల సమయంలో సీఎం అని తన కార్యకర్తలతో అనిపించుకుంటుంన్నారని … రేవంత్ పై సీనియర్ నేత వీహెచ్ పరోక్షంగా మండిపడ్డారు.
కోర్ కమిటీ ఎజెండా ప్రకారం మున్సిపల్ ఎన్నికలు , ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్ ఎం చేయాలనే దాని పై నేతలు చర్చించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే మైనారిటీలకు, బీసీలకు 50శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆ బాధ్యతను నియోజవర్గ ఇంఛార్జీలకు అప్పయిగించాలని డిసైడ్ అయ్యారు. కొన్ని పోరాట కార్యక్రమాలకు ఆమోద ముద్ర వేశారు. అయితే.. ఆ అంశాలను అమల్లోకి తెచ్చే వారెవరో.. వారికే తెలియదనే సెటైర్లు కూడా అక్కడే పడ్డాయి.
ప్రభుత్వంపై పోరాడాల్సిన.. టీ కాంగ్రెస్ సీనియర్లు.. ఇప్పుడు.. రేవంత్ ను.. ఎలా కట్టడి చేయాలనే మిషన్నే పెట్టుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతూండటంతో… కాంగ్రెస్ హైకమాండ్ కూడా.. ప్రత్యామ్నాయంగా రేవంత్ పేరును పరిశీలిస్తోందని చెబుతున్నారు. సొంత నియోజకవర్గంలో పరువు కాపాడుకోలేకపోయిన ఉత్తమ్ కు.. రేపోమాపో ఊస్టింగ్ తప్పదని.. త్వరలోనే రేవంత్ కు పగ్గాలిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో.. కాంగ్రెస్ సీనియర్లలో.. ఆందోళన ప్రారంభమయింది. అందుకే … కాంగ్రెస్ బలపడటం కన్నా.. రేవంత్ బలహీనం కావడం ముఖ్యమన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంటోంది.