ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి .. కరోనాపై సమీక్షలు జరిపిన ప్రతీసారి పట్టుబట్టి మరీ ఓ మాట చెబుతూంటారు.. అదేమిటంటే.. 104 కాల్ సెంటర్‌ను బలోపేతం చేయడం. 104 కాల్ సెంటర్‌ను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సమాచారం అందించాలని సీఎం జగన్ ఆదేశిస్తూ ఉంటారు. ఆయన ఆదేశాల ప్రకారం… గన్నవరంలోని సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్‌సీఎల్‌లో కోవిడ్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కరోనా బాధితులకు ఫోన్ ద్వారా వైద్య సలహాలు ఇచ్చేందుకు 300 మంది వైద్యులను కన్సల్టెంట్లుగా నియమించకోవాలని నిర్ణయించారు. హెచ్‌సీఎల్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు కోవిడ్ బాధితులు ఫోన్ చేస్తే.. ఆ ఫోన్‌ను డాక్టర్‌కు కనెక్ట్ చేస్తారు.
బాధితుడికి వైద్యుడు సలహాలు, సూచనలను, లక్షణాలను బట్టి మందులను ఇస్తారు. కరోనా పెరుగుతున్న కారణంగా చాలా చోట్ల ఔట్‌పేషెంట్ సేవలు అందుబాటులో లేని నేపథ్యంలో 104 కాల్ సెంటర్‌ను బలోపేతం చేసి బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యులకు గంటకు రూ. నాలుగు వందలు ఇచ్చేలా ఒప్పందం చేసుకోనున్నారు. కొంత మంది వైద్యులతో ఒప్పందం చేసుకున్నారు. అందుకే హెచ్‌సీఎల్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు.
హెచ్‌సీఎల్ గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటయింది. కొన్ని వేల మంది ఏపీ యువతకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కల్పించింది.అయితే కరోనా కారణంగా క్యాంపస్ వర్క్ దాదాపుగా లేదు. ఎక్కువగా వర్క్ ఫ్రం హోం కల్పిస్తున్నారు. అదే సమయంలో.. కాల్ సెంటర్ సేవలు అందించేందుకు అంగీకరించింది. నిజానికి గత ప్రభుత్వం .. ఆర్టీజీఎస్ను వాడుకునేది. దానికి అనుబంధంగా గన్నవరంలో ఓ కాల్ సెంటర్ పెట్టారు. కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఆ ఆర్టీజీఎస్, కాల్ సెంటర్‌ను వాడటం లేదు. కాల్ సెంటర్‌ను తీసేశారు. ఇప్పుడు.. కోవిడ్ కోసం హెచ్‌సీఎల్‌లో కాల్ సెంటర్ పెట్టాల్సి వస్తోంది.