ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు 26 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ నమోదయింది. దీంతో మొత్తం 190 మందికి వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఉదయం పదహారు మందికి సోకినట్లుగా మీడియా బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం.. సాయంత్రం మరో పది మందికి సోకినట్లుగా ప్రకటించింది. వీరందరీ.. ఢిల్లీ వెళ్లి వచ్చిన తబ్లిగీలేనని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 32 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఇరవై ఆరు, కడపలో ఇరవై మూడు మందికి పాజిటివ్‌గా తేలింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
గుంటూరు, కడపలోని టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. టెస్టుల వేగంగా వేగం పెరగలేదు. ఇప్పటికి నాలుగు వందల మంది అనుమానితుల శాంపిల్స్ టెస్టుల్లో ఉన్నాయి. వారి వివరాలు రావాల్సి ఉంది. పాజిటివ్‌గా తేలుతున్న వారితో సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. తబ్లిగీలతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించడం అధికారవర్గాలకు కష్టంగా మారింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎవరూ క్వారంటైన్ పాటించలేదు. అందరితోనూ సన్నిహితంగానే ఉన్నారు. ఈ కారణంగా.. కాంటాక్ట్ కేసులు పెరుగుతాయేమోనన్న ఆందోళన అధికారవర్గాల్లో ఉంది.
దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటికే మూడు వేలు దాటిపోయింది. మహారాష్ట్ర, తమిళాడు, ఢిల్లీల్లో అత్యదిక కేసులు నమోదవుతున్నాయి. అయితే.. దేశం మొత్తం మీద నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికం ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారివే కావడంతో… వీరిని.. వీరితో సన్నిహితంగా ఉన్న వారిని… క్వారంటైన్ చేస్తే.. తాత్కాలికంగా పాజిటివ్ కేసులు పెరిగినా.. తర్వాత తగ్గుదల కనిపిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.