మీడియా రంగాన్ని కరోనా కుదిపేస్తోంది. ముఖ్యంగా రిపోర్టర్లు కరోనా బారీన పడడం పాత్రికేయులకు కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల సోమాజీ గూడ ఈనాడు కార్యాలయంలోని ఉద్యోగులకు రాండమ్ గా టెస్టులు చేయిస్తే – పదహారు మంది కరోనా బారీన పడినట్టు నిర్దారణ అయ్యింది. ఇప్పుడు ఈ కరోనా సెగ రామోజీ ఫిల్మ్సిటీకీ చేరింది. ఈనాడుకి చెందిన ప్రధాన పాత్రికేయ దళం ఫిల్మ్‌సిటీలోనే ఉంది. దాదాపు 80 శాతం ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. ఓ డెస్కులోని ఇద్దరు సభ్యులకు కరోనా పాజిటీవ్ సోకడంతో.. ఫిల్మ్‌సిటీలోని ఓ ఫ్లోర్లో పనిచేస్తున్న దాదాపు 50 మంది ఉద్యోగులకు ఈరోజు కరోనా టెస్టులు చేయించారు. వారందరి రిపోర్టులూ రావాల్సివుంది. ఈలోగా ఈ ఉద్యోగులకుందరికీ వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో పనిచేసే సౌకర్యం కల్పించారు. ఈ యాభై మందిలో కొంతమందికి అప్పుడే కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొంతమందిలో ఈ లక్షణాలు లేకపోయినా, లోలోపల భయంతోనే గడుపుతున్నారు. ఇప్పటికే చాలామంది ఉద్యోగులు, ముఖ్యంగా రిపోర్టర్లు సెలవులో ఉన్నారు. తాజా పరిణామంతో యాభై మంది ఉద్యోగులలో చాలామంది సెలవలు తీసేసుకున్నారు. దాంతో తగు స్థాయిలో సిబ్బంది లేక ఈనాడు సతమతమవుతోంది.