విశాఖ జిల్లాలో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావం ప్రారంభమైన తర్వాత మొత్తం 29 కేసులు నమోదవగా.. ఇరవై మంది డిశ్చార్జయ్యారు. 9 మంది చికిత్స పొందుతున్నారు. అయితే.. అసలు విశాఖ కరోనా ఫ్రీ గా మారే దశలో.. కొత్త కేసులు రావడం ప్రారంభమయ్యాయి. ఓ దశలో మూడే యాక్టివ్ కేసులు ఉన్నాయి. మూడు వారాల పాటు ఒక్క కొత్త కేసు నమోదు కాలేదు. కానీ ఇప్పుడు రోజూ.. ఒకటో..రెండో కేసులు బయటపడుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు కేసులు బయటపడ్డాయి. దీంతో విశాఖ కరోనా ముప్పు నుంచి బయటపడలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా హాట్ స్పాట్లుగా మారిన జిల్లాల్లో వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 5943 శాంపిల్స్‌ను పరీక్షించగా.. అందులో 62 మందికి వైరస్ సోకినట్లుగా గుర్తించారు. ఇందులో అత్యధికం కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. అక్కడ ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలులో మొత్తం కరోనా పాజిటివ్ ల సంఖ్య 436కి చేరింది. కృష్ణా జిల్లాలో కొత్తగా 12, నెల్లూరు జిల్లాలో ఆరు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1051 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోలుకుని 441 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గతవారం రోజులుగా.. సగటున అరవై నుంచి డెభ్బై కేసులు నమోదవుతున్నాయి. టెస్టులు ఎక్కువగా చేస్తున్నందు వల్లే… ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాలోనూ అనూహ్యంగా కేసులు పెరుగుతూండటం మాత్రం ఆందోళన కలిగించే విషయంగా చెబుతున్నారు.