దేశంలో ధర్డ్ వేవ్ వచ్చేసింది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వరుసగా నమోదవడం ప్రారంభించాయి. ఇప్పటికే ఇతర దేశాల్లో కలకలం రేపుతున్న వైరస్.. ఇండియాలోనూ నలభై కేసుల వరకూ నమోదయ్యాయి. మొత్తం 8 రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. ఎప్పట్లాగే.. మహారాష్ట్ర ఈ డెల్టా ప్లస్ వేరియంట్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 22 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఆరు కేసులు.. కేరళలో 2, ఏపీ, పంజాబ్, జమ్మూలో ఒక్కో కేసు నమోదయినట్లుగా కేంద్రం ప్రకటించింది.
డెల్టా ప్లస్ వైరస్ అత్యంత ప్రమాదకరమైందిగా నిపుణులు చెబుతూండటంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్రాలన్నీ తమ దగ్గర కరోనా ప్రభావం తగ్గిపోయిందని.. సడలింపులు ఇస్తున్న సమయంలో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ధర్డ్ వేవ్ ముప్పు.. డెల్టా ప్లస్ వేరియంట్‌తోనే రావొచ్చని ఇప్పటికే నిపుణులు ప్రభుత్వాలకు నివేదిక అందించారు. ఇలాంటి సమయంలో… కొత్త వేరియంట్ కేసులు పెరిగిపోవడం ఆందోళనకు గురి చేసే పరిస్థితే. ఇప్పటికీ సెకండ్ వేవ్ పూర్తి స్థాయిలో సద్దుమణగలేదు.
అప్పుడే ధర్డ్ వేవ్ సూచనలు రావడం ప్రభుత్వాలను సైతం కలవరపరిచేదే. జరిగేదేదో జరుగుతుంది అనుకున్న ప్రభుత్వాలను ఎవరూ ఏమీ చేయలేరు. కానీ సెకండ్ వేవ్‌లోనే ప్రజలు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ డెల్టా ప్లస్‌ను ఎక్కడిక్కడ కట్టడి చేయకపోతే… దేశంలో మరోసారి లాక్ డౌన్ సీజన్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సింది ప్రభుత్వాలే.