కరోనా భయంతో దేశం అంతా షట్ డౌన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు బయటపడుతున్న కారణంగా.. అనేక రాష్ట్రాలు.. సినిమా ధియేటర్లు, మాల్స్, స్కూల్స్ తో పాటు జనం గుమికూడే కార్యక్రమాలను రద్దు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ సర్కార్ కూడా.. అదే పని చేస్తోంది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక,రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ప.బెంగాల్…గోవాలో విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేస్తున్నారు. ఈనెల 31 వరకు అన్ని టోర్నీలను క్రీడా సంఘాలు రద్దు చేసుకున్నాయి. భారత్‌లోని అన్ని అమెరికా కాన్సులేట్లు మూసివేస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్లడం.. రావడం తగ్గిపోయాయి. శరవేగంగా కరోనా విస్తరిస్తోందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యయిక పరిస్థితి ప్రకటించింది. ఈ క్రమంలో.. ఏపీలోనూ అనుమానితులు పెరుగుతున్నారు.
ఇప్పటికే నెల్లూరులో కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. పలు చోట్ల అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నా ప్రస్తుతం.. ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. నెలాఖరు తర్వాత పరోతరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు పరిస్థితి దిగజారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముందు ముందు బహిరంగ కార్యక్రమాలు ఏమీ వద్దనే ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల నిర్వహణ అనుమానంలో పడుతోంది. మొండిగా ఎన్నికలకు వెళ్లి… ప్రజలను వైరస్ బారిన పడేలా చేయవద్దన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలంటూ వరుసగా నెలాఖరు వరకు జరగాల్సి ఉంది.
ఈ లోపు పరిస్థితి మరింత తేడాగా మారితే..ఎన్నికలను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే విద్యాసంస్థలే మూసేస్తున్నారు. ఈ విషయంలో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. ఏ పనీ చేయలేని పరిస్థితి ఏర్పడితే మాత్రం.. ఏపీ సర్కార్ అనేక ఇబ్బందులు పడుతుంది. టెన్త్ పరీక్షలను ఇప్పటికే ఎన్నికల కోసం వాయిదా వేశారు.. ఇప్పుడు కరోనాభయంతో వాయిదా వేస్తే వారు మరింత టెన్షన్ పడతారు.