కరోనా తెచ్చిన కష్టం పండగలపై తీవ్రంగా పడతోంది. అన్లాక్ ప్రకటించడంతో ఇక పండుగలు సాధారణంగా చేసుకోచ్చని.. దీపావళిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని అనుకున్నారు. వ్యాపార కార్యకలాపాలు కూడా పంజుకుంటూండటంతో అంతా బాగుంటుందని లెక్కలేసుకున్నారు. కానీ ఇప్పుడు కాలుష్యం వల్ల .. కరోనా పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందన్న ఉద్దేశంతో.. అనేక రాష్ట్రాలు దీపావళి బాణసంచాను నిషేధించడం ప్రారంభించాయి. ముందుగా కరోనా సెకండ్ వెవ్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ బాణసంచా కాల్చడాన్ని నిషేధించింది. ఇప్పటికే కాలుష్యం కూడా ఢిల్లీలో తీవ్ర స్థాయిలో ఉంది. ఢిల్లీ బాటలోనే ఒడిషా, రాజస్థాన్ కూడా నడిచాయి. హర్యానా కూడా ఆంక్షలు విధించింది.
చివరికి బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక కూడా అదే దారిలో నడిచింది. పైగా.. ఎవరైనా నిషేధాన్ని ఉల్లంఘించి బాణసంచా కాలిస్తే.. ఫైన్లు వేస్తామని హెచ్చరించింది. దీపావళికి ఇంకా వారం రోజులు గడువు ఉన్నందున.. మరికొన్ని రాష్ట్రాలు అదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రాల నిర్ణయం తమిళనాడుకు మాత్రం శరాఘాతంలా తలుగుతోంది. దేశంలో ఉపయోగించే బాణసంచాలో అత్యధికం తమిళనాడు నుంచే సరఫరా అవుతోంది. ఇప్పుడు రాష్ట్రాలు నిషేధించడంతో తయారీ దారులకుపెద్ద కష్టం వచ్చి పడుతోంది. దీంతో తమిళనాడుసీఎం పళనీ స్వామి బాణసంచా కాల్చడంపై నిషేధాన్ని పునంపరిశీలించాలంటూ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాస్తున్నారు.
అయితే.. ఆరోగ్య పరంగా ఎలాంటి రిస్క్ తీసుకోడవానికి సిద్ధంగా లేని రాష్ట్రాలు నిషేధానికే మొగ్గుచూపుతున్నాయి. మామూలుగా బాణసంచాకు వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్ చేస్తే.. బీజేపీ నేతలు రెచ్చిపోతారు. ఈ సారి బీజేపీ పాలిత రాష్ట్రాలే ఆ దిశగా ముందడుగు వేయడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది దీపాల దీపావళి మాత్రమే వెలుగులీనే అవకాశం ఉంది.