తెలుగు మీడియా రంగంలో రారాజు.. ఈనాడు. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని, తనని తాను మలచుకోవడంలో ఈనాడుకి తిరుగులేదు. పదేళ్ల ముందుకెళ్లి ఆలోచించుకుని, అందుకు తగ్గట్టుగా సర్వసన్నద్ధం అవ్వడం ఈనాడు ప్రత్యేకత. అయితే అలాంటి ఈనాడు ఖ్యాతి, ప్లానింగ్.. కరోనాతో ఘోరంగా దెబ్బతింది.
కరోనా ఎఫెక్ట్ ఈనాడుపై బలంగా పడింది. ఇప్పటి వరకూ దాదాపు 40 మంది ఈనాడు స్టాఫ్ కరోనా బారీన పడినట్టు మీడియా సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సండే మ్యాగజైన్ డెస్క్‌లో పనిచేస్తున్న దాదాపు ఏడెనిమిది మంది సబ్ ఎడిటర్లు కరోనాకి గురయ్యార్ట. ఇంచార్జ్తో సహా. దాంతో.. ఇప్పుడు డెస్క్ మొత్తం మూతబడింది. దాంతో ఆ డెస్క్ బాధ్యతలు మరొకరికి అప్పగించారు. చాలా డెస్కుల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే ఇటీవల ఈనాడులో స్టాఫ్‌ని బాగా తగ్గించేశారు. సీనియర్లకు సెటిల్మెంట్ చేసి, ఇంటికి పంపించేశారు. ఇంతకు ముందున్న స్టాఫ్‌లో దాదాపు 30 నుంచి 40 శాతం తగ్గిపోయారు. ఉన్నవాళ్లలో చాలామంది కరోనా బారీతో ఇంటి వద్దనే ఉండిపోయారు. ఇంకొంతమంది సెలవుల్లో ఉన్నారు. చాలామంది వర్క్ ఫ్రమ్ హోం డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎలా చూసినా,.. ఈనాడులో పనిచేసే స్టాఫ్ తగ్గిపోయారు. ఇద్దరు ముగ్గురు సబ్ ఎడిటర్లు చేయాల్సిన పని.. ఒకరిపై పడుతోంది. ఎవరు ఏ డెస్క్ పని చేయాలో, ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలో తెలియని గందరగోళం నెలకొంది.
ఈనాడులో పనిచేసే ప్రముఖ కార్ట్యూనిస్ట్ శ్రీధర్‌కు కరోనా సోకిందన్న వార్తలు వస్తున్నాయి. దానికి తోడు గత కొన్ని రోజులుగా శ్రీధర్ కార్టూన్లు ఈనాడులో కనిపించడం లేదు. ఇదీ సంగతి పేరుతో ప్రధాన పేజీలో ఆయన కార్టూన్ వేస్తారు. అవి ఇప్పుడు కనిపించడం లేదు. శ్రీధర్ లేకపోతే మరో ప్రత్యామ్నాయం లేదు. కార్టూన్ లేకుండా పేపర్ ని తీసుకొస్తారు తప్ప, మరొకరికి ఆ బాధ్యత అప్పగించరు. శ్రీధర్ కోలుకునేంత వరకూ కార్టూన్ లేకుండా పేపర్ని వదలాలా, లేదంటే.. మరో ఆప్షన్ని చూసుకోవాలా? అనేది తెలీని సందిగ్థం యాజమాన్యంలో ఉంది.
జిల్లా ఎడిషన్లు లేకుండానే ఈనాడు పేపర్ వస్తోంది. సిబ్బంది లేకపోవడం, యాడ్లు లేకపోవడంతో ఖర్చు తగ్గించుకోవాలన్న మిషతో జిల్లా ఎడిషన్లను ఆపేశారు. ఈనాడు అనే కాదు.. చాలా ప్రధాన పత్రికలు టాబ్లాయిడ్ లను పక్కన పెట్టాయి. నమస్తే తెలంగాణ ఒక్కటే ఇప్పుడు జిల్లా పేజీల్ని తీసుకొస్తుంది. ఈనాడు కూడా టాబ్లాయిడ్ లను పునరిద్ధరించాలని ఈనాడు భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్టిలో ఉంచుకుని ఆ ప్రతిపాదన విరమించుకుంది. ఈనాడు నుంచి జిల్లా పేజీలను చూడడం దాదాపుఅసాధ్యమే అని మీడియా వర్గాలు చెబుతున్నాయి.