కరోనా మహమ్మారి ఎంత దారుణంగా విస్తరిస్తోదంటే.. ఏ ఒక్కరిని కదిలించినా.. ఆత్మీయులను.. బంధువును కోల్పోయామన్న మాటలే వినిపిస్తున్నాయి. సమాచారం సేకరించే జర్నలిస్టుల్లోనూ అదే మాట వినిపిస్తోంది. కారణం విస్తృతం అయ్యాక.. తెలుగు రాష్ట్రాల్లోని పదిహేను మంది జర్నలిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో స్ట్రింగర్లు మాత్రమే కాదు… జిల్లా స్థాయి రిపోర్టర్లు .. డెస్క్‌లో పని చేసేవాళ్లు కూడా ఉన్నారు. సాక్షి ఉద్యోగులు ఇద్దరు చనిపోయిన వారిలో ఉన్నారు. సాక్షి కడప జిల్లా స్టాఫర్ తో పాటు… డెస్క్‌లో పని చేసే రామచంద్రరావు అనే సబ్ ఎడిటర్ కూడా కరోనా కారణంగా చనిపోయారు.
కరోనా కారణంగా చనిపోయిన వారిలో సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ కూడా ఉన్నారు. జర్నలిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఆయన…కరోనాతో పది రోజుల పాటు పోరాడి నిమ్స్‌లో చనిపోయారు. బతుకమ్మ టీవీ సీఈవో, శ్రీకాకుళం ఎన్టీవీ రిపోర్టర్ చంద్రశేఖర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా పదిహేను మంది జర్నలిస్టులు మూడు, నాలుగు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో.. తెలియచెప్పే లెక్క ఇది.
జర్నలిస్టుల కోసం సంఘాల్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన అమర్నాథ్ చనిపోతేనే.. పెద్దగా ఎవరూ పట్టిచుకోలేదు. ఇతర జర్నలిస్టుల గురించి ఎవరు పట్టించుకుంటారు. కొన్ని కొన్ని టీవీ చానళ్ల యాజమాన్యాలు మాత్రం… జిల్లా స్థాయి రిపోర్టర్లు చనిపోతే కొంత అండగా ఉంటున్నాయి. ఆ కుటుంబాలకు కాస్తో కూస్తో సాయం చేస్తున్నాయి. కానీ ఇతరులు చనిపోతే పట్టించుకునేవారు కూడా లేరు. ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం మానేశాయి. బతికి ఉండి.. పత్రిక కోసం పని చేస్తున్నప్పుడు మాత్రమే వారి అవసరం నేతలకు ఉంది. చనిపోయిన తర్వాత వారి గురించి పట్టించుకునే తీరిక కూడా నేతలకు లేదు. దీంతో జర్నలిస్టులు.. అంపశయ్యమీద ఉన్నట్లు అయింది.