వేసవి అంటే మాంచి బిజినెస్ సీజన్ కూడా. సమ్మర్ సినిమాలని డేట్లు ఫిక్స్ చేసుకొని సీజన్ కోసం వేచిచూస్తుంటారు. పరీక్షలు పూర్తి చేసుకొని రిలాక్స్ అవుతున్న యువతకు సినిమా ఓ ప్రధాన వినోదం. ఇదే కాదు.. సమ్మర్ అంటే ఐపీయల్ కూడా. యావత్ దేశం ఈ సీజన్ కోసం వెయిట్ చేస్తుంటుంది. దాదాపు నెలన్నర పాటు క్రికెట్ వినోదం. ఇటు సినిమా అటు క్రికెట్.. ఈ రెండు చాలు సమ్మర్ ని సక్సెస్ ఫుల్ గా ముగించడానికి. అయితే ఇప్పుడా రెండు వినోదాలు లేవు. కారణం కరోనా మహమ్మారి. ‘మేడిన్ చైనా”.. ఈ దరిద్రపుగొట్టు వైరస్ ని కూడా ప్రొడ్యుస్ చేసింది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రవాణ వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మార్కెట్ల పతనం కొనసాగుతుంది.
ప్రస్తుతం కరోనా భయం చూస్తుంటే ఎంతకాలం ఈ పరిస్థితి కొనసాతుందో చెప్పడానికి లేదు. ఈ ప్రభావం సమ్మర్ పై పడింది. భారతీయల ప్రధాన వినోదం క్రికెట్, సినిమా.. ఇప్పుడు ఈ రెండు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే సినిమా థియేటర్లు మూతపడ్డాయి. సినిమా షూటింగులు నిలిపేశారు. సమ్మర్ రావాల్సిన సినిమా రావు. థియేటర్లు తెరచుకుంటాయో లేదో తెలియని పరిస్థితి.
ఐపీయల్ అంటే .. కంప్లీట్ బిజినెస్ అనుకొవచ్చు. సినిమా కూడా బిజినెస్సే. కానీ ఈ బిజినెస్ ని నమ్ముకొని కొన్ని కుటుంబాలు బ్రతుకుతాయి. ఒక థియేటర్ వుంటే కిల్లి కొట్టు నుండి సైకిల్ స్టాండ్ వరకూ కనీసం ఇరవైమంది దానిపై ఆధారపడి బ్రతుకుతుంటారు. ఇక సినిమానే కెరీర్ గా చేసుకొని, షూటింగ్ కి వెళ్తేనే పొట్ట నింపుకునే వారి పరిస్థితి చెప్పనవరసం లేదు. సినిమా కోసం పని చేసే రోజువారి కూలీలు కూడా వుంటారు. వారి పరిస్థితి కూడ అగమ్యగోచరంగా వుంది. మొత్తానికి ఈ సమ్మర్ చాలా డ్రైగా వుండబోతుందన్న సంగతి మాత్రం అర్ధమౌతుంది. వేసవి ఇంకా వెడెక్కకముందే కరోనా రూపంలో కాటేసింది 2020 సమ్మర్.