2020 క్యాలెండర్లో సగం రోజులు ఖాళీ అయిపోయాయి. ఆరు నెలలు అతి కష్టంగా, భారంగా, నిష్టూరంగా గడిచిపోయాయి. సినిమా భాషలో చెప్పాలంటే ఫస్టాఫ్ అయిపోయింది. ఎలాంటి చడీ చప్పుడూ లేకుండా, సినిమాల జోరు చూడకుండా నీరసంగా – చప్పగా – చేదుగా ‘విశ్రాంతి’ కార్డు వేసేసుకుంది. మార్చి నుంచి కరోనా కంగారు మొదలైంది. అట్నుంచి చూసుకున్నా – మూడు నెలల పాటు సందడి లేకుండా పోయింది. 2020లో తొలి అర్థభాగానికి సెలవు చెప్పేశాం. ఇక మిగిలింది సెకండాఫే. దానిపై కూడా ఎవరికీ ఎలాంటి హోప్స్ లేవు.
జనవరిలో ఎప్పటిలానే సంక్రాంతి హడావుడి మొదలైపోయింది. మహేష్, అల్లు అర్జున్ సినిమాలు రేసులో ఉండడంతో – టాలీవుడ్ కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. ఒక రోజు తేడాతో రెండు పెద్ద సినిమాలు విడుదల అవ్వడం, రెండూ కలక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించడం చూసి `అబ్బో..` అనుకుంది చిత్రసీమ. కానీ.. ఆ విజయోత్సాహం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇదే సీజన్లో విడుదలైన `ఎంత మంచి వాడవురా` ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. జనవరిలోనే వచ్చిన `డిస్కోరాజా` రవితేజకు మరో ఫ్లాప్ ఇచ్చింది. అశ్వద్ధామ, చూసీ చూడంగానే, సవారీ – ఇలా వరుస ఫ్లాపులు టాలీవుడ్ పై దండయాత్ర చేశాయి.
ఈ యేడాది అందరి దృష్టినీ ఆకర్షించిన మరో సినిమా `జానూ`. తమిళంలో విజయవంతమైన`96` రీమేక్ ఇది. సమంత కథానాయికగా నటించడం, దిల్ రాజు ప్రొడక్షన్ కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే 96 ఫీల్ ని రీక్రియేట్ చేయడంలో ఈ సినిమా విఫలమైంది. జిరాక్స్ కాపీలా మిగిలింది తప్ప, వర్జినాలిటీ సంపాదించలేకపోయింది. విజయ్ దేవరకొండ `వరల్డ్ ఫేమస్ లవర్`గా ఆకట్టుకోవడానికి విఫలయత్నం చేశాడు. టైటిల్ లో ఉన్న టచ్.. తెరపై కనిపించలేదు. మూడు ఉప కథల్లో ఏ ఒక్కటీ ఆకట్టుకోకపోవడంతో లవర్.. బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టేశాడు.
సంక్రాంతి తరవాత చిత్రసీమ మరో హిట్టు చూడ్డానికి `భీష్మ` వరకూ ఆగాల్సివచ్చింది. నితిన్ – రష్మికల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడంతో `భీష్మ` కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. `పలాస` విమర్శల ప్రశంసలు అందుకున్నా – వసూళ్లని రాబట్టుకోలేకపోయింది. ఓ పిట్ట కథ, అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ, త్రీ మంకీస్, ప్రెషర్ కుక్కర్ లాంటి చిన్న సినిమాలు ఏమాత్రం వర్కవుట్ కాలేదు. మార్చి రెండో వారం నుంచే కరోనా ప్రభావంతో థియేటర్లు మూసేశారు. అప్పటి నుంచీ బాక్సాఫీసు దగ్గర సందడి లేకుండా పోయింది.
ఓటీటీ.. అంతా తూచ్!
థియేటర్లు లేకపోతేనేం.. ఓటీటీ ఉంది కదా అనుకున్నారు చిత్ర నిర్మాతలు. మొదట్టో ఓటీటీ బేరాలపై బాగానే కథనాలు సాగాయి. ఈ వేసవిలో విడుదల కావాల్సిన `వి`, `నిశ్శబ్దం`, `ఒరేయ్ బుజ్జిగా` లాంటి సినిమాలు ఓటీటీకి అమ్ముడుపోయాయని, వాటికి మంచి రేట్లు పలికాయని గట్టిగా ప్రచారం సాగింది. కానీ.. ఇందులో ఏ ఒక్కటీ ఓటీటీ గూటికి వెళ్లలేదు. ఓటీటీ వాళ్లు ఇచ్చే రేట్లకీ, బడ్జెట్లకీ పొంతన లేకపోవడంతో అటు వైపుకు వెళ్లడానికి నిర్మాతలు మక్కువ చూపించలేదు. అమృతారామమ్, 47 డేస్, పెంగ్విన్ లాంటి చిత్రాలు ఓటీటీలోకి వెళ్లినా – వాటి ప్రభావం అంతంత మాత్రమే. కృష్ణ అండ్ హిజ్ లీలకు మంచి రిపోర్ట్ వచ్చినా – ఎక్కువ మందికి చేరలేదు.
సెకండాఫ్ పరిస్థితేంటి?
ఫస్టాఫ్ ఎలా గడిచినా – సెకండాఫ్, క్లైమాక్స్ బాగుంటే సినిమా గట్టెక్కేస్తుంది. ఆ లెక్కన చూస్తే జులై నుంచి డిసెంబర్ మధ్య సాగే ద్వితీయార్థం కీలకం కానుంది. కాకపోతే.. ఈ సెకండాఫ్ పైనా ఎవ్వరికీ నమ్మకాల్లేవు. సెప్టెంబరు, అక్టోబరు వరకూ థియేటర్లు తెరిచే అవకాశం లేదని అర్థమైపోతోంది. 2020 పై చిత్రసీమ ఆశలు వదులుకోవాల్సిందేనని సురేష్ బాబులాంటి వాళ్లే చెబుతున్నారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. పెద్ద సినిమాలు సిద్ధమైనా విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చూపించకపోవొచ్చు. 2020 లో ఇక థియేటర్లు తెరవడం కల్లే అనే సంగతి అర్థమవుతోంది. నిర్మాతలూ అందుకు సిద్ధమైపోతున్నారు. వాక్సిన్ వచ్చి, కరోనా కష్టాలు ఇక ఉండవు అనే భరోసా వస్తే గానీ, జనం థియేటర్ల వైపుకు రారు. వాక్సిన్ రావడానికి ఇంకా టైముందని వైద్య నిపుణులే చెబుతుండడంతో…. ఇక రాబోయే రోజుల్లో థియేటర్లు తెరచుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. ఏవైనా అద్భుతాలు జరిగి, కరోనా కష్టాలు తొలగిపోయి, థియేటర్లు తెరచుకుంటే తప్ప – చిత్రసీమ మళ్లీ కళకళలాడదు.