ఇప్పటికే కరోనా వల్ల.. సినిమా షూటింగులు బంద్ అయ్యాయి. మార్చి 31 వరకూ క్లాపుల గలగలలు కనిపించవు. నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం మొత్తం ఇళ్లకే పరిమితమైంది. ఇప్పుడు ఈ కరోనా కష్టాలు బుల్లి తెరకూ పాకేశాయి. టీవీ సీరియళ్ల షూటింగులు కూడా బంద్ అయ్యాయి. మార్చి 31 వరకూ టీవీ సీరియళ్లూ, షోలకు సంబంధించిన షూటింగులు ఆపేయాలని తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ (టీటీటీ&డబ్ల్యూ ఎప్) నిర్ణయం తీసుకుంది. అన్ని టీవీ ఛానళ్లూ ఈ బంద్‌కి సహకరించాలని, ఎలాంటి షూటింగులు నిర్వహించకుండా చూసుకోవాలని సూచించింది. నిబంధనకు వ్యతిరేకంగా షూటింగులు నిర్వహిస్తే ఫెడరేషన్ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పరిస్థితి అదుపులోకి రాకపోతే తదుపరి పరిణామాలపై మార్చి 31న నిర్ణయం తీసుకుంటామని ఫెడరేషన్ తెలిపింది.
టీవీ షూటింగులు ఆపేయడం వల్ల తక్షణం వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే ముందస్తుగా కొన్ని ఎపిసోడ్లు పూర్తి చేసుకుని ఉంటారు కాబట్టి.. ఆ షోలకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు.కాకపోతే సీరియళ్లపై ఆధారపడే జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకే ఇబ్బంది.