“వాడకం తగ్గాలంటే రేట్లు పెంచాలి..” ఈ ఫార్ములాను ప్రపంచంలో ఎక్కడా ఉపయోగించరు.. ఒక్క ఇండియాలో తప్ప. కరోనా వైరస్ కారణంగా… రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లపై ఎవరూ రాకూడదంటూ.. రైల్వే శాఖ ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్‌ను రూ. 50కి పెంచేసింది. దీంతో రైలు ప్రయాణికులు ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. టిక్కెట్లు ఉన్న వారినే రానిస్తాం.. అలా రాని వాళ్ల కోసం ఒక్క సహాయకుడ్ని అనుమతిస్తామని.. చెబితే అయిపోయే దానికి.. టిక్కెట్ల బాదుడు ఎందుకో అర్థం కాని పరిస్థితి. వైరస్ పేరుతో.. ఖచ్చితంగా రైల్వేస్టేషన్‌కు రావాల్సిన వారిని బాదేసి.. డబ్బులు పిండుకునే ఆలోచనే తప్ప… ఇందులో. ..కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకునే జాగ్రత్త ఎక్కడ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచ దేశాల్లో.. కరోనా వైరస్ కట్టడికి.. ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం.. వారికి మాస్క్‌లు పంపిణీ చేయడం.. శానిటైజర్లు అందుబాటులో ఉంచడం.. పబ్లిక్ ప్లేసుల్లో వైరస్ వ్యాప్తికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి చేస్తూంటాయి. కానీ ఇండియాలో మాత్రం.. వైరస్ అలర్ట్ రాగానే… రూ. రెండు మాస్క్‌ను.. ఏకంగా రెండు వందలు చేశారు. శానిటైజర్లు వందల రూపాయల్లో అమ్ముతున్నారు. ప్రభుత్వం తరపున ఎక్కడా కనీస జాగ్రత్తలు కనిపించడం లేదు. పోనీ ఆయా వాటిని బ్లాక్ మార్కెట్ చేయకుండా ఆపుతున్నారా అంటే అదీ లేదు. చివరికి… ప్రభుత్వం కూడా.. కరోనా పేరుతో డబ్బులు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. కరోనా భయంతో.. కొన్ని లక్షల మంది టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారు. ప్రజల్లో అంత భయం ఉంది. తప్పని సరిగానే ప్రయాణాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. స్టేషన్లలోకి వచ్చే ఆ కొద్ది మందికి శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలి కానీ.. వారి వద్ద.. ఫ్లాట్ ఫాం టిక్కెట్ల పేరుతో దోపిడీ చేయడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వినియోగం తగ్గించాలంటే.. రేట్లు పెంచాలన్న కాన్సెప్ట్ ను.. ఏపీ లో కూడా.. కొత్త ప్రభుత్వం అమలు చేస్తోంది. దశలవారీ మద్యనిషేధం చేస్తామంటూ.. షాపులు తగ్గించి..మద్యంపై రేట్లు పెంచేశారు. ఇప్పుడు.. అక్కడ మద్యం వినియోగం తగ్గిందో లేదో కానీ.. పెద్ద ఎత్తున ఆదాయం మాత్రం ప్రభుత్వానికి వస్తోంది. లక్ష్యానికి మించి వసూళ్లు అవుతున్నాయి. ఇప్పుడు.. రైల్వే శాఖ కూడా… వైరస్ కారణంగా తగ్గిపోతున్న ఆదాయాన్ని ఫ్లాట్ ఫాం టిక్కెట్లతో బాదేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.