తెలుగు చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు, నివారణ చర్యల్లో బాగంగా సినిమా షూటింగ్స్ నిలిపివేస్తున్నామని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ ప్రకటించారు.ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్లో 24 విభాగాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య సినిమా షూటింగ్ ని వాయిదా వేసినట్లుప్రకటించారు. ‘కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాలు అభినందనీయం. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం కూడా అవసరం. మా వరకూ వస్తే.. సినిమా షూటింగ్స్‌లో కూడా పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 15 రోజుల పాటు షూటింగ్స్ వాయిదా వేస్తే బాగుంటుందని నేను భావించాను. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోన్న నా సినిమా షూటింగ్‌ని వాయిదా వేస్తున్నా. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను” చెప్పుకొచ్చారు మెగాస్టార్.
సమ్మెలు జరిగినప్పుడో, లేదా తుఫాన్ లాంటి ప్రకృతి విపత్తలు వచ్చినపుడో షూటింగులకు బ్రేకులు పడుతుంటాయి. అయితే రెండుమూడు రోజుల్లో మళ్ళీ యధావిధి పరిస్థితి వచ్చేస్తుంటుంది. అయితే ఈ కరోనా బంద్ మాత్రం ఎవరూ ఉహించనది. వేలమంది కార్మికులు సినిమాలని నమ్ముకుని బ్రతుకుసాగిస్తుంటారు. ఇప్పుడు సడన్ గా షూటింగులు నిలిచిపోతే వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం. అంతేకాదు థియేటర్లు కూడా మూసేశారు. థియేటర్ అంటే కేవలం సినిమా చూపించడం కాదు. అదో వ్యవస్థ. టిక్కెట్లు ఇచ్చేవాడి నుండి హాల్ క్లీన్ చేసే స్విపర్ వరకూ కొన్ని కుటుంబాలు ఆదారపడి వుంటాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. అసలు ఈ బంద్ ఎప్పటివరకో కూడా క్లారిటీ లేదు. మొత్తానికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదనివాపోతున్నారు చిత్రపరిశ్రమపై ఆదారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు.