తెలంగాణలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తీసుకొచ్చి దున్నేయాలనుకుంటున్న వైఎస్ షర్మిల హంగామాకు కరోనా బ్రేకులేసే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో బహిరంగసభకు ఇచ్చిన అనుమతుల్ని అధికారులు రద్దు చేస్తున్నారు. హైదరాబాద్లో గో మహాగర్జన అనే కార్యక్రమాన్ని చేపట్టాలని కొన్ని సంస్థలు అనుకున్నాయి. ముందుగా పర్మిషన్ కూడా తీసుకున్నారు. హఠాత్తుగా ఆ కార్యక్రమానికి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి కరోనా విజృంభణను కారణంగా చూపించారు. దీంతో వచ్చే నెల తొమ్మిదో తేదీన షర్మిల ఖమ్మంలో పెట్టాలనుకుంటున్న సభపైనా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
ఖమ్మంలో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు. అందు కోసం పోలీసులకు అనుమతి ధరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారు. కానీ కరోనా ఆంక్షలు పెట్టారు. ఆరు వేల మంది మాత్రమే రావాలని.. కరోనా నిబధనలు అన్నీ పక్కాగా పాటించాలని సూచించారు. ఇవన్నీ ఫార్మాలిటీగా చేసే సూచనలు . రాజకీయ పార్టీలు పాటిస్తాయా లేదా అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు అంతకంతకూ పెరుగున్నాయి. ఖమ్మంలోనూ అదే పరిస్థితి. మరో పది రోజులు ఉంది. ఈ లోపు ఆ జిల్లాలో మరిన్ని కేసులు నమదైతే.. సభకు అనుమతి పర్మిషన్ రద్దు చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే షర్మిలకు తెలంగాణ ప్రభుత్వ పెద్దల అండ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఖమ్మం సభకు అనుమతిని కూడా టీఆర్ఎస్ పెద్దల స్పెషల్ ఇంట్రెస్ట్తోనే ఇచ్చారన్న ప్రచారం ఇప్పటికే తెలంగాణ రాజకీయవర్గాల్లో ఉంది. ఈ క్రమంలో ఎంత కరోనా ఉన్నా షర్మిల సభకు అడ్డం ఉండదన్న అభిప్రాయం కూడ ఉంది. ఎలా అయినా లక్ష మందితో సభ నిర్వహించి తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా ప్రచారం చేసుకోవాలని.. షర్మిల పార్టీ వ్యూహకర్తలు పట్టుదలతో ఉన్నారు. పార్టీ పేరు… జెండా అదే రోజు ప్రకటించనున్నారు. ఒకవేళ కరోనా వల్ల సభ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే.. షర్మిలకు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పరిస్థితి మారిపోతుంది.