కరోనా విషయంలో ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆలోచనల్లో మార్పు వస్తోంది. అంతకు ముందుగా ఈ వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు. తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కరోనా పేషెంట్ల డిశ్చార్జ్‌పై ఐసీఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్ చూస్తే ఇదే నిజమని అనిపించక మానదు. ఇక ఎవరికైనా.. పాజిటివ్ వచ్చిన వారికి 10 రోజుల చికిత్స తర్వాత పరీక్షలు లేకుండా డిశ్చార్జ్ చేయాలని ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ జారీ చేసేసింది. డిశ్చార్జ్ అయినా మరో ఏడు రోజులు హోం ఐసోలేషన్ ఉండాలని.. సూచించింది. అయితే.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. ప్రైమరీ, సెకండరీ, మూడో కాంటాక్ట్స్‌కు లక్షణాలు లేకుంటే కరోనా వైరస్ సోకినట్లు గుర్తిస్తే.. ఇంట్లోనే ఉంచి చికిత్స చేయవచ్చునని సూచించారు.
కరోనా వైరస్ విషయంలో అతిగా భయపడ్డామని .. దేశాన్ని భయపెట్టామనే అభిప్రాయం… కేంద్రంతో పాటు… ఐసీఎంఆర్ వర్గాల్లోనూ కనిపిస్తోందని.. తాజా ఆదేశాలను బట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ బాధితుడికి పధ్నాలుగు రోజుల తర్వాత డాక్టర్లు రెండు సార్లు టెస్ట్‌లు చేస్తారు. రెండు సార్లు నెగెటివ్ వస్తేనే వారిని డిశ్చార్జ్ చేసేవాళ్లు. ఇదే పద్ధతిని అందరికీ ఫాలో కావాలని ప్రోటోకాల్ అన్ని రాష్ట్రాలకు పంపింది ఐసీఎంఆర్. కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు అలా కాదు.. లక్షణాలు లేకపోవడమే కాదు.. పెద్దగా లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తిని… పది రోజులు ఆస్పత్రిలో ఉంచేసుకుని.. డిశ్చార్జ్ చేయాలని చెబుతోంది.
రోగులను మూడు కేటగిరీలుగా విభజించింది. ఆ ప్రకారమే డిశ్చార్జి విధానాన్ని అనుసరించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. తాజా మార్గదర్శకాల్లో కేవలం సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు మాత్రమే డిశ్చార్జికి ముందు పరీక్షలు అవసరమని పేర్కొన్నారు. అంటే లక్షణాలు కనిపించే వారికి కూడా టెస్టులు వద్దంటోంది ఐసీఎంఆర్. చికిత్స సమయాన్ని కూడా కేంద్రం 10 రోజులకు కుదించింది. అంటే.. వ్యాధి తీవ్రత అంతగా లేనివారికి 10 రోజులు చికిత్స అందించి, ఇంటికి పంపుతారు. ఆ తర్వాత వారు వారం రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ సమయంలో వ్యాధి తిరగబెడితే.. జాతీయ , రాష్ట్ర హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేస్తే చికిత్సకు సలహాలు ఇస్తారు. అంతటితో అయిపోతుంది. దేశంలో బయట పడుతున్న కరోనా కేసుల్లో దాదాపుగా 75 శాతం వాటిల్లో లక్షణాలు ఉండటం లేదు. ఈ కారణంగానే ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.