కరోనా కారణంగా సినీ పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ఇక థియేటర్ వ్యవస్థ అయితే చెప్పాల్సిన పనిలేదు. చాలా థియేటర్లు మూతబడ్డాయి. అనేక సమస్యలతో అల్లాడుతున్నాయి. థియేటర్ వ్యవస్థని మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన సమయం ఇది. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రోజుకి 5 ఆటలు ప్రదర్శించుకునే అవకాశం గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు 5వ ఆటకు అనుమతులు రాబోతున్నాయి.
ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఎగ్జిబీటర్ల కీలకమైన సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన ప్రతిపాదల్ని మంత్రి ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఎగ్జిబీటర్లు. 5వ ఆటకు అనుమతులు, లాక్ డౌన్ సమయంలో కరెంటు బిల్లుల నుంచి మినహాయింపు, వినోదపు పన్నులో రాయితీ.. ఇలాంటి కీలకమైన అంశాల్ని చర్చించబోతున్నారు. 5వ ఆటకు దాదాపు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. కరెంటు బిల్లుల మినహాయింపు కూడా ఓకే అయినట్టే. సాయింత్రం లోగా.. మరిన్ని విషయాలు తెలుస్తాయి.
అయితే ఏపీలో థియేటర్ల పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. టికెట్ రేట్ల సడలింపు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అక్కడ ఇంకా నైట్ షోలు లేవు. 6న కొత్త సినిమాలు విడుదలైనా… చాలా థియేటర్లు తెరచుకోలేదు. ఈనెల 13, 14న కొత్త సినిమాలు మరిన్ని రాబోతున్నాయి. ఈసారైనా థియేటర్లు తెరుస్తారా? నైట్ షోలకు అనుమతి ఉంటుందా? అనే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.