టాలీవుడ్ ఉలిక్కి పడే వార్తే ఇది. కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని, షూటింగులు మొదలెడుతున్న చిత్రసీమని మరో నాలుగు అడుగులు వెనక్కి వేయించే సందర్భం ఇది. `పుష్ప` సెట్లో కరోనా బాధితులు బయటపడడంతో… ఆ షూటింగ్ ఆగిపోయిందన్న వార్త టాలీవుడ్ ని కంగారు పెట్టింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో `పుష్ప` షూటింగ్ ఇటీవలే మొదలైంది. బన్నీతో సహా ప్రధాన తారాగణం అంతా షూటింగ్ లో పాల్గొంటోంది. సెట్లో 150 మంది కంటే ఎక్కువ సభ్యులు ఉండకూడదని చెబుతున్నా… అంతకు మూడు రెట్ల సిబ్బందితో షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా పనుల్లో పాలుపంచుకుంటున్న వాళ్లలో కొంతమందికి కరోనా వచ్చినట్టు, వెంటనే షూటింగ్ ని నిలిపేసినట్టు సమాచారం అందుతోంది. `పుష్ఫ` షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రధాన సాంకేతిక నిపుణులకెవరికైనా కరోనా సోకినట్టైతే… ఇప్పట్లో `పుష్ప` షూటింగ్ లేనట్టే.
`పుష్ప` ఎపిసోడ్.. మొత్తం టాలీవుడ్ ని అప్రమత్తం చేయడం ఖాయం. ఆచార్య, రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్ లాంటి పెద్ద సినిమాలు ఇప్పుడు సెట్స్‌పై ఉన్నాయి. వాళ్లలో కరోనా భయాలున్నా, చాలా జాగ్రత్తలు తీసుకునే షూటింగ్ చేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా చేసినా కరోనా వచ్చే ఛాన్స్ వుందని `పుష్ప` ఎపిసోడ్ హెచ్చరించింది. ఇది నిజంగా డేంజర్సిగ్నల్ లాంటిదే. అసలు నిబంధనల్ని పాటిస్తూనే సినిమా వాళ్లు షూటింగులు చేస్తున్నారా, లేదా? అనేది ఒకసారి ప్రభుత్వ యంత్రాంగం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుతం సెట్లో ఉన్న సినిమాలు, అందులో పాలుపంచుకుంటున్న నటీనటులు, సాంకేతిక నిపుణులలో ఇప్పుడు కొత్త కంగారు మొదలయ్యే ప్రమాదం ఉంది. సాహసించి సెట్లో అడుగుపెట్టినవాళ్లు సైతం… పుష్ప ఉదంతంతో కాస్త వెనకడుగు వేస్తారేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.