కరోనా ఫస్ట్ వేవ్ తోనే చిత్రసీమ సగం చితికిపోయింది. ఆ ప్రభావం తగ్గి, థియేటర్లు మళ్లీ తెరచుకుని, సినిమాలు వరుస కట్టి, వరుసగా నెలకో హిట్టు పడుతుంటే – టాలీవుడ్ మళ్లీ గాడిన పడినట్టే అనిపించింది. ఆ ఆశలపై సెకండ్ వేవ్ పూర్తిగా నీళ్లు చల్లేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే… టాలీవుడ్ కి గడ్డు కాలం ఎదురవుతోందన్న సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం పెద్ద సినిమాలపై విపరీతంగా పడే అవకాశం ఉంది.
ఈ సీజన్ లో రావాలనుకున్న సినిమాలు ఆచార్య, అఖండ, రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్ చాలా ముఖ్యమైనవి. ఇవి భారీ బడ్జెట్ సినిమాలు. వీటిపై… సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత ఏడాది కరోనా వల్ల.. ఆగిపోయిన సినిమాల్లో ఇవీ ఉన్నాయి. అప్పటి నుంచీ… పలుమార్లు షూటింగులు వాయిదా పడుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ… చిత్రీకరణలు జరుపుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ షూటింగులకు బ్రేక్ పడింది. మళ్లీ ఈ సినిమాల విడుదల తేదీలు మారడం ఖాయం. సినిమా ఆలస్యమయ్యే కొద్దీ… బడ్జెట్లు పెరుగుతూ పోతాయి. ఒకటీ, రెండు నెలలు సినిమా ఆగిందంటే ఫర్వాలేదు. నెలల తరబడి, నిర్విరామంగా సినిమాలు ఆగుతూ పోతే, అనుకున్న బడ్జెట్ కీ, సినిమా పూర్తయ్యే టప్పటికి కనిపించే అంకెలకూ అస్సలు సంబంధమే ఉండదు.
పైగా ఈ సినిమాల కోసం భారీ సెట్లు వేశారు. అవన్నీ సినిమాలు పూర్తయ్యే వరకూ అలానే ఉండాలి. అదో అదనపు ఖర్చు. ఫైనాన్స్ తెచ్చుకుంటే.. వడ్డీలు తడిచి మోపెడు అవుతుంటాయి. కరోనా కష్టాల్ని అధిగమించి చిత్రీకరణలు పూర్తి చేసినా, విడుదల సమయానికి ఆక్యుపెన్సీ ఎలా ఉంటుందో చెప్పలేం. 100 శాతం ఆక్యుపెన్సీ ఉంటే గానీ, పెద్ద సినిమాలు బయటకు వచ్చే ఛాన్సు లేదు. మరో కనిపించని కష్టం ఏమిటంటే.. సంవత్సరాలు తరబడి చిత్రీకరణలు జరుపుకూనే ఉంటుంటే.. ఆయా సినిమాలపై ఉన్న క్రేజ్ తగ్గుతూ ఉంటుంది. పైగా హీరోల లుక్ యేడాదికేడాది మారుతూ ఉంటుంది. అవన్నీ సినిమాపై పరోక్షంగా ప్రభావం చూపిస్తుంటాయి. ఎటు చూసినా… నిర్మాతలకు ఇది కష్ట కాలమే. మునుముందు మంచి రోజులు వస్తాయన్న భరోసాతో ఉండడం తప్ప, ఇప్పుడు ఎవరూ ఏం చేయలేని పరిస్థితి వచ్చింది.