కామర్స్ చదివి వైద్యం చేస్తానని.. అది కూడా కరోనాను క్షణాల్లో తరిమికొట్టే వైద్యం చేస్తానంటూ పిటిషన్ వేసిన కోల్‌కతాకు చెందిన సురేష్ షా అనే వ్యక్తికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం రూ. వెయ్యి జరిమానా విధించింది. నిజానికి అప్పటికే అతను కోల్‌కతాలో వైద్యం ప్రారంభించేశారు. అధికారులు కేసులు పెట్టడంతో న్యాయపోరాటం ప్రారంభించారు. కోల్‌కతా హైకోర్టులో వైద్యం చేస్తానంటూ పిటిషన్ వేశారు. అక్కడ కొట్టి వేయడంతో సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.
కరోనాకు మందులేక డాక్టర్లు, సైంటిస్టులు తలపట్టుకుంటుంటే.. కామర్స్ చదివి మందులు ఎలా ఇస్తావంటూ ప్రశ్నించిన సీజేఐ రమణ ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. దానికి ఆయన వద్ద సమాధానం లేదు. పిటిషనర్ తీరుపై సీజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పది లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది అయితే తాను నిరుద్యోగినని.. తన వద్ద అంత సొమ్ము లేదని.. చెల్లించలేనని మొరపెట్టుకున్నాడు. తాను టీచర్‌నని.. ఇప్పుడు ఉద్యోగం కూడా లేదని.. వెయ్యి రూపాయలు అయితే కట్టగలనని విన్నవించుకున్నాడు. దాంతో వెయ్యి జరిమానా విధించిన సుప్రీంకోర్టు.. ఆ మొత్తాన్ని కోల్ కతా లీగల్ సర్వీసెస్ అధారిటీకి జమ చేయాలని ఆదేశించింది.
చదివింది కామర్స్ అయినా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నసురేష్ షా.. ధైర్యంగా హైకోర్టు.. సుప్రీంకోర్టు వరకూ వచ్చి.. తాను వైద్యం చేస్తానంటూ వాదించడం ఆసక్తికరంగా మారింది. అయితే సురేష్ షా లాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ఉన్నారు. తాము చదివిన చదువుకు సంంబధం లేకపోయినా ఇష్టం వచ్చినట్లుగా కరోనాకు వైద్యం చేయడం.. వైద్య పద్దతులను సూచిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తున్నారు. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఇచ్చిన తీర్పు వల్ల ఇలాంటి వాటికి తెర పడుతుందని భావిస్తున్నారు.