ఆంధ్రప్రదేశ్లో కరోనా మూడో దశలోకి ప్రపవేశిచిందని.. ప్రభుత్వం హెల్త్ సెక్రటరీ జవహర్ రెడ్డి చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. మూడో దశ అంటే… దాదాపుగా చేతులు దాటిపోయినట్లే. వైరస్ సామాజిక వ్యాప్తి జరగడం ప్రారంభం అయితే.. ఆపడం సాధ్యం కాదు. అభివృద్ధి చెందిన దేశాలే సామాజిక వ్యాప్తి దశకు వచ్చిన తర్వాత చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. సాధారణంగా కరోనా వైరస్.. విదేశాలకు వెళ్లిన వారు.. అక్కడ వైరస్ బారిన పడి వస్తారు. అది మొదటి దశ. రెండో దశలో.. వారి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఇప్పటి వరకూ ఇండియాలో ఇదే దశ ఉన్నట్లుగా చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చినా.. ఢిల్లీ నుంచి వచ్చినా వారి ద్వారా మాత్రమే ఇతరులకు సోకుతుంది. అది రెండో దశ. ఈ దశలోనే కరోనాను అరికట్టాలని కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. కానీ… ఇప్పుడు.. సామాజిక వ్యాప్తి సూచనలు బయటపడటం కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్లో .. కేవలం.. లక్షణాలు బయటపడిన వారి శాంపిల్స్నే పరీక్షిస్తున్నారు. ఇలా పరీక్షించిన వారిలో.. ఎనిమిది మందికి ట్రావెల్ హిస్టరీ లేదు. పాజిటివ్ కేసులు ఉన్న వారితో కాంటాక్ట్ కూడా కాలేదు. అయినప్పటికీ వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో.. అధికారవర్గాలు ఆశ్చర్యపోయాయి. వారికి ఎలా కరోనా సోకిందన్నది వారికి మిస్టరీగా మారింది. ఇది సామాజిక వ్యాప్తి సూచనగా అనుమానిస్తున్నారు. అందుకే.. ఏపీలో ర్యాండమ్ టెస్టులు చేయాలని నిర్ణయించుకున్నారు. హాట్ స్పాట్లుగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా ర్యాండమ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేయనున్నారు. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొన్ని కిట్లు రావాల్సి ఉంది. అవి అందుబాటులోకి రాగానే పరీక్షలు పెంచనుంది.
సామాజిక వ్యాప్తి ప్రమాదం ముంచుకు రావడంతో.. ఏపీలో ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లను… ఉదయం తొమ్మిది గంటలకే పరిమితం చేస్తున్నారు. మరో వైపు.. ఒక్క ఏపీలోనే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సామాజిక వ్యాప్తి ప్రభావం కనిపిస్తోంది. కేరళలోనూ.. ట్రావెల్ హిస్టరీ, పాజిటివ్ హిస్టరీ ఉన్న వ్యక్తులతో కాంటాక్ట్ లేని వారికి కూడా కరోనా పాజిటివ్ వస్తోంది. ఇలాంటి వారిలో కొంత మంది అసలు లక్షణాలు లేకపోవడం.. ప్రభుత్వ వర్గాలకు మరింత ఆందోళన కలిగించే పరిణామం.