భారత్ నుంచి ఇటీవల కొన్ని విమానాలు ఎగురుతున్నాయి. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నాయి. అయితే అవి కమర్షియల్ ఫ్లైట్లు కాదు. భారత్‌లో ఉన్న తమ పౌరుల్ని.. తమ దేశాలకు రప్పించుకుంటున్న వివిధ దేశాల ఫ్లైట్లు. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఒక్కరంటే.. ఒక్క భారతీయ పౌరుడ్ని.. అటు వైపు నుంచి ప్రభుత్వాలు తీసుకు రావడం లేదు.. తీసుకొచ్చే ప్రయత్నమూ చేయడం లేదు. తీసుకెళ్లాలని.. పలు దేశాల్లో భారతీయులు కన్నీటితో వేడుకుంటున్నా… ప్రభుత్వాల్లో కనీస స్పందన ఉండటం లేదు.
కరోనా కారణంగా ప్రస్తుతం ఏ దేశమూ.. విదేశీయుల్ని భరించే స్థితిలో లేదు. గల్ఫ్ దేశాలు సహా.. అన్ని ఆయా దేశాల్లో ఇరుక్కుపోయిన వారిని వెనక్కి పంపాలని అనుకుంటున్నాయి. తీసుకెళ్లాలని అన్ని ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో భారతీయులు కొన్ని వేల మంది ఉంటారు. చెల్లుబాటు వీసా ఉన్న వారు.. స్థిరనివాసం ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ… కార్మికులు.. వీసా పూర్తయిన వారిని ఆయా దేశాలు తీసుకెళ్లాలని గల్ఫ్ దెశాలు పట్టుబడుతున్నాయి. భారత్‌కూ అలాంటి సమాచారం పంపింది. కరోనా టెస్టులు చేస్తామని.. పాజిటివ్ వస్తే తామే చికిత్స చేస్తామని.. నెగెటివ్ వచ్చిన వారినే తీసుకెళ్లాలని గల్ఫ్ దేశాలు కోరుతున్నాయి. కానీ భారత్ ఇంకా సమాధానం చెప్పలేదు. దీంతో మరోసారి ఇండియా నుంచి వచ్చే వర్కర్లకు వీసాలు జారీ చేసే ప్రక్రియను కఠినతరం చేయాలని గల్ఫ్ దేశాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
గల్ఫ్ లోనే కాదు.. అమెరికా సహా అనేక దేశాలు.. తమ దేశాల్లో ఉన్న విదేశీయులను.. వెళ్లిపోవాలని కోరుతున్నాయి. తమ దేశాల్లో ఉన్న వారిని తీసుకెళ్లకపోతే.. తర్వాత వీసాల జారీలో ఆంక్షలు విధిస్తామని అమెరికా లాంటి దేశాలు కూడా హెచ్చరిస్తున్నాయి. అయితే.. భారత ప్రభుత్వం మాత్రం ఇంకాఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విద్యార్థులు, పర్యాటకులు.. ఇలా.. కొన్ని వేల మంది భారతీయులు వివిధ దేశాల్లో పడిగాపులుప పడుతున్నారు. విద్యార్థులు ఎయిర్‌పోర్టుల నుంచి తమను తీసుకెళ్లాలని దీనంగా వేడుకుంటున్న దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. కానీ .. ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొసమెరుపేమింటే.. కొద్ది రోజుల క్రితం.. ఇంగ్లాండ్ పౌరులను తీసుకుని ఎయిర్ ఇండియా విమానం ఒకటి లండన్ వెళ్లింది. కానీ ఖాళీగా తిరిగి వచ్చింది. హిత్రూ ఎయిర్ పోర్టులో పడిగాపులు పడుతున్న విద్యార్థుల గురించి కనీసం పట్టించుకోలేదు.