కరోనా వైరస్ ఎంత భయంకరమో కానీ.. ఆ వైరస్ పేరుతో మీడియా, సోషల్ మీడియాల్లో జరుగుతున్న ప్రచారమే ఇంకా భయంకరంగా మారింది. ప్రజలందరి మనసుల్లో ఓ భయాన్ని నాటడంలో… సోషల్ మీడియా, మీడియా సక్సెస్ అయింది. వెల్లువలా వస్తున్న ఫేక్ వీడియోలు.. ఫేక్ వార్తలతో.. చివరికి గాలి పీల్చినా కరోనా వస్తుందేమో అన్న భయంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు.
జనం మనసుల్లో కరోనా భయం నింపేసిన మీడియా, సోషల్ మీడియా..!
కరోనా కంటే ఆ వైరస్‌పై జరుగుతున్న ప్రచారమే ప్రమాదకరంగా మారింది. కోవిడ్-19 ప్రమాదకరమైన వైరస్ అని ప్రచారం చేయడంతో.. అది సోకితే చచ్చిపోతారన్నట్లుగా ప్రచారం జరిగిపోయింది. ఎయిడ్స్ వచ్చిన వారినైనా కాస్త జాలిగా చూస్తున్నారేమో కానీ.. కరోనా వచ్చిన వారంటే.. వణికిపోతున్నారు. కరోనా వచ్చిన వ్యక్తి తమ కాలనీలో ఉంటే.. కాలనీ ఖాళీ అయిపోతోంది. ఎటూ వెళ్లలేని వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ప్రభుత్వం కూడా.. హడావుడి చేస్తోంది. స్కూళ్లు మూసేస్తోంది. శానిటేషన్ చేస్తోంది. ఇవన్నీ.. ప్రజల్లో కంగారు పెంచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వార్డును మా చుట్టు పక్కల ఉంచొద్దంటూ పద్మారావ్ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దానికి కారణం.. అనేక రకాలుగా ప్రచారం జరుగడమే.
పాత వీడియోలతో కరోనా విలయం అంటూ ఫేక్ పోస్టులు..!
ఈ అనవసర ప్రచారాలకు వ్యాపారాలు మూత పడుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్క కేసు నమోదైందని చెప్పడంతో.. బస్సులు, మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా వాడికి వచ్చింది.. వీడికి వచ్చిందంటూ పుకార్లు ఆ భయాన్ని మరింత పెంచుతున్నాయి. చైనాలో ఒకడు వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారంటూ ఓ వీడియో హల్ చల్ చేసింది. ఓ వ్యక్తి ఉమ్మి.. దానిని లిఫ్ట్ బటన్లకు రుదుతూ కనిపించే విజువల్స్ సంచలనంగా మారాయి. అసలు అవన్నీ ఇప్పటి వీడియోలు కాదు.. ఐదేళ్ల కిందటి వీడియోలను ఏదో సందర్భంలో రికార్డయిన వీడియోలను.. ఇలా సర్క్యూలేట్ చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారికే..ఇండియాలో ఒక్కరికీ సోకలేదు..!
భారత్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిజానికి దేశంలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. ఇటలీ, దుబాయ్ నుంచి వచ్చిన కొందరికి మాత్రమే కరోనా ఉంది. అక్కడే వారికి ఆ వైరస్ సోకింది. వారి నుంచి ఎవరికీ విస్తరించలేదు. వారి నుంచి మరొకరికి విస్తరించినా .. భారత్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కరోనా వ్యాప్తి కంటే.. ఈ పుకార్లు. అసత్యాల వ్యాప్తినే పెద్ద వైరస్‌గా మారింది. కట్టడి చేయకపోతే భారీ నష్టమే.