సుదీర్ఘ విరామం తరవాత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం `వకీల్ సాబ్`. ఈ సినిమాని మే 15న విడుదల చేస్తామని దిల్ రాజు ప్రకటించారు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయ్యింది కూడా. పవన్ పై కొన్ని కోర్టు సీన్లు, ఇండోర్ సీన్లు తీశారు. పవన్ ఫ్లాష్ బ్యాక్ తీయాల్సివుంది. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం టాలీవుడ్ పై పడి షూటింగులన్నీ రద్దయిన సంగతి తెలిసిందే. దాంతో వకీల్ సాబ్ షెడ్యూళ్లు కూడా చెల్లాచెదురైపోయాయి. మళ్లీ ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి.
దాంతో మే 15న ఈ సినిమా విడుదల అవుతుందా, లేదా? అనే అనుమానాలు మొదలైపోయాయి. ఎంత కాదన్న రెండు వారాలైనా ఈ చిత్రం ఆలస్యమయ్యే ఛాన్సుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాకపోతే.. అనుకున్న డేట్‌నే ఈ సినిమాని విడుదల చేయడానికి దిల్ రాజు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ ఎప్పుడు మొదలైనా… మిగిలిన చిత్రీకరణ ఫటాఫట్ లాగించేయాలని ప్లాన్ వేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి సన్నివేశాలన్నీ దాదాపుగా ఇండోర్ లో తీయాలి. ఇండోర్ షూటింగ్‌తో లాభమేమిటంటే.. రాత్రీ, పగలు అనే తేడా లేకుండా షూటింగ్‌ని కొనసాగించొచ్చు. ఏప్రిల్ 20 నాటికి షూటింగ్ పూర్తి చేయాలన్నది ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక. ఇప్పుడు మరో పది రోజులు ఆటూ ఇటూ అయినా… వకీల్ సాబ్‌ని మే 15ని తీసుకొచ్చేయొచ్చు అన్న ధీమాలో ఉన్నాడు దిల్ రాజు. పబ్లిసిటీ కోసం చేతిలో సమయం లేకపోయినా ఫర్వాలేదన్నది దిల్ రాజు ఆలోచన. ఎందుకంటే ఇది పవన్ కల్యాణ్ సినిమా. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్‌తో పనిలేదన్నట్టు… పవన్ సినిమాకి పెద్దగా ప్రచారం అవసరం లేదు.
ఇప్పుడు షూటింగ్ అయితే లేదు గానీ, ఎడిటింగ్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునే ఛాన్సుంది. కాబట్టి… ఈ విరామంలో అలాంటి పనులన్నీ ఓ పక్క పూర్తి చేసుకుంటూ వస్తే టైమ్ కలిసొస్తుంది. సో.. వీలైనంత వరకూ వకీల్ సాబ్ ని వాయిదా వేయకపోవొచ్చు. కరోనా ప్రభావం మరీ ఘోరంగా ఉండీ, మరో రెండు వారాల తరవాత కూడా షూటింగులు మొదలుకాకపోతే తప్ప – వకీల్ సాబ్ రిలీజ్‌కి ఢోకా లేనట్టే.