ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో… నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లుగా జాతీయ మీడియా ప్రకటించింది. ఈ మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదివారం ప్రకటించిన మీడియా బులెటిన్‌లో కృష్ణా జిల్లాలో 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 50 కేసులు విజయవాడలోనివే. ఇందులోనే రాజ్‌భవన్‌కు చెందిన నలుగురికి సోకిన వివరాలు ఉన్నాయో లేదో చెప్పలేదు. రోజువారీగా విడుదల చేసే మీడియా బులెటిన్ సోమవారం విడుదల చేస్తారు. అందులో అధికారికంగా చెబుతారేమోనని తెలుగు మీడియావర్గాలు ఎదురు చూస్తున్నాయి.
రాజ్‌భవన్‌లో వైరస్ సోకిన నలుగురిలో… ఒకరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కాగా.. మిగిలిన వారు మెడికల్, హౌస్ కీపింగ్ విభాగాల్లో పని చేసేవారు మరో ఇద్దరు. గవర్నర్ ఇంటి పనులు చేసే వారిలో ఒకరికి వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం నంచి రాజ్‌భవన్‌ను… వైరస్ నిరోధక ద్రావణాలతో పెద్ద ఎత్తున శుభ్రం చేయడం ప్రారంభించారు. డ్రోన్లు ఉపయోగించి మరీ శుద్ధి చేశారు. దీంతో.. విజయవాడ ప్రజల్లో కలకలం రేగింది. ఈ విషయం జాతీయ మీడియా స్పష్టమైన ప్రకటన చేసింది. తాము ప్రకటించకుండా.. ఎలాంటి వైరస్ వార్తలను ప్రచురించినా… కేసులు పెడతామని ఏపీ సర్కార్ ఇప్పటికే బెదిరించడంతో.. తెలుగు మీడియా ప్రకటించడానికి వెనుకాడుతోందని తెలుస్తోంది.
జాతీయ మీడియా మాత్రం.. ఏపీ సర్కార్ హెచ్చరికలను పట్టించుకోలేదు. నేరుగా నాలుగు కేసులు.. రాజ్ భవన్లో ఉన్నాయని ప్రకటించింది. ఎవరెవరికి వచ్చాయో కూడా చెప్పింది. దాంతో.. ఈ వివరాలన్నీ సహజంగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే కేసుల విషయాలను ఏపీ సర్కార్ దాస్తోదంని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు.. బయటపడిన కేసుల అధికారిక సమాచారం కూడా చెప్పకపోతూండటం… జాతీయ మీడియా ప్రకటించిన తర్వాత కూడా… క్లారిటీ ఇవ్వకపోవడం… విస్మయం కలిగిస్తోందని ప్రతిపక్ష పార్టీల నేతలంటున్నారు.