దేశంలో తొలి కోవిడ్ -19 కేసు కేరళలో వెలుగు చూసింది. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. కరోనా ఎక్కువగా దాడి చేసే అవకాశం ఉన్న రాష్ట్రం కేరళ. ఎందుకంటే.. విదేశీ ప్రయాణికులు ఎక్కువగా కేరళకే వస్తూపోతూంటారు. దానికి తగ్గట్లుగానే పాజిటివ్ కేసుల సంఖ్య మొదట్లో మహారాష్ట్రతో పోటీ పడి ఉంది. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలకు చేరువగా ఉంటే.. కేరళలో 300 దగ్గరే ఆగిపోయింది. కేరళ వైరస్‌ను కట్టడి చేసిన విధానం చూసి దేశం మొత్తం అబ్బుర పడుతోంది.
కేరళలో పూర్తిగా అదుపులోకి వచ్చిన వైరస్..!
ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనాను కట్టడి చేయలేకపోతోంది. అత్యాధునిక వైద్య వ్యవస్థ, అన్ని సౌకర్యాలు కలిగిన దేశాలు కూడా తమ ప్రజల ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నాయి. మన దేశంలోనూ కోవిడ్-19 విజృంభణ కొనసాగుతున్న వేళ కేరళలో మాత్రం తగ్గుముఖం పట్టాయి. వైరస్ నియంత్రణలో కేరళ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ కేరళలో 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. కొలుకుంటున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. వృద్ధులు సైతం వైరస్ బారి నుంచి బయటపడుతున్నారు. 60ఏళ్లు దాటిన వృద్ధులకు వైరస్ సోకితే ప్రాణాలు కాపాడటం కష్టం. కానీ 80 ఏళ్లు దాటిన వృద్ధులు వైరస్ బారిన పడినా.. కోలుకునేలా వైద్యం చేసి ఇంటికి పంపారు కేరళ వైద్యులు.
అత్యధిక టెస్టులు చేసి.. పకడ్బందీగా కంట్రోల్ చేసిన ప్లాన్..!
మన దేశంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు జనవరి నెలలో కేరళలో బయటపడింది. మొదటి కేసు బయటపడిన కొన్ని గంటల్లో వైరస్ బాధితున్ని ఐసోలేషన్‌కు తరలించారు. తర్వాత అత్యవసరంగా అధికారులతో ప్రభుత్వం సమావేశం నిర్వహించి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. వైరస్ నియంత్రణ కోసం భారీగా నిధులు విడుదల చేసింది. ప్రతీ జిల్లాలో విస్తృతంగా కోవిడ్-19 టెస్ట్‌లు చేసింది. దాదాపు 12వేల710 శాంపిల్స్ తీసుకున్నారు. దీంతో వైరస్ బారినపడిన వారిని గుర్తించి ఐసోలేషన్‌కు తరలించారు. ప్రత్యేకగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. ఖాళీగా ఉన్న భవనాలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. పెద్ద సంఖ్యలో వైద్య, పారామెడికల్ సిబ్బందిని నిమామకం చేపట్టారు. ఐసీయూ, వెంటిలేటర్ల సంఖ్య పెంచారు.
మర్కజ్కి వెళ్లి వచ్చిన వాళ్లూ ఎక్కువే.. అయినా కేరళ చైతన్య పరిచింది..!
టెస్టులు తక్కువ చేసి.. తక్కువ కేసులున్నాయని చెప్పుకునే పద్దతి ఇప్పుడు దేశంలో ఉంది. కానీ కేరళలో అందరి కంటే ఎక్కువ టెస్టులు చేశారు. కేరళ నుంచి విదేశాలకు వెళ్లిన వారు పెద్ద సంఖ్యలో స్వరాష్ట్రం తిరిగి రావడంతో….వారిని అతి తక్కవ సమయంలో గుర్తించారు. వారందరికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేశారు. వారిలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి కలిసిన వారి వివరాలు సేకరించి వారందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఇక ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని కొన్ని గంటల్లో గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. దీంతో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అవకుండా నియంత్రించారు. లాక్‌డైన్ కూడా పటిష్టంగా అమలు చేశారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. వైరస్ విజృంభిస్తుండగా…ప్రజల్లో అవగాహన కల్పించారు. బ్రేక్ ద చైన్ పేరిట అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై కార్యక్రమాలు రూపొందించారు. బహిరంగ ప్రదేశాల్లో సబ్బు, నీళ్లు, వాష్ బెషిన్లు ఏర్పాటు చేశారు.
వైద్య సిబ్బందికి లోటు లేని రక్షణ సదుపాయాలు..!
కరోనా కోరలు చాస్తున్న వేళ వైద్యసిబ్బందిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదు. వారికి అన్ని విధాలుగా రక్షణ కల్పించింది. ఐసోలేషన్‌లో సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. కొత్తగా ప్లాస్మా చికిత్స చేసి.. వైరస్‌కు వీలైనంత వేగంగా చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. వైరస్ కట్టడికి ఏ చిన్న అవకాశాన్ని కేరళ సర్కార్ వదులుకోలేదు. దీంతో పరిస్థితో మార్పు వచ్చింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలకు కేరళ వైరస్ నియంత్రణలో రోల్ మోడల్‌గా మారింది.
ప్రతిపక్షాలను కలుపుకుని పేదల సంక్షేమం అమలు…!
లాక్డౌన్ విఫలమవడానికి ఇతర రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువులు, పేదలకు సాయం అందకపోవడమే కారణం. కేరళ ఈ సమస్యను ముందే గుర్తించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.21000 కోట్లు నిధులు ప్రకటించింది. ప్రతిపక్ష నేతలతో చర్చలు జరిపి.. ఉమ్మడి సంయుక్త సమావేశంలో దీన్ని ప్రకటించారు. కేరళలో వలస కూలీలు పెద్ద ఎత్తున ఉన్నారు. కానీ.. ఎవరికీ ఎలాంటి సమస్య రాలేదు. వారిని వలస కూలీలుగా చూసే చాన్సే లేదని.. మేం వారిని అతిథులుగా భావించి ఆదుకున్నామని సీఎం పినరయి విజయన్ ప్రకిటంచారు. లాక్‌డౌన్‌తో వారికి పని లేకుండా పోయినా ప్రత్యేక వసతులు కల్పించారు. 11వేలకు పైగా క్యాంప్‌లు ఏర్పాటు చేశాశారు. 2లక్షల 48వేల 570 మందికి షెల్టర్ కల్పించారు. వైద్య సదుపాయాలు, ప్రత్యేక వసతులు కల్పించారు. కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి.. భోజనం ఇంటికే అందించేలా ఏర్పాట్లు చేశారు.