లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలనుకుంటున్న కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ -19 కేసులు నమోదయి హాట్ స్పాట్లుగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేవని.. జనసంచారం ఉండనే ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే.. ఇతర ప్రాంతాల్లో మాత్రం.. వెసులుబాటు ఇచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా లాక్డౌన్ ఎత్తివేసినట్లుగానే నిబంధనలు సడలించింది. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు యధావిధిగా నిర్వహించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అలాగే.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు కూడా ప్రారంభించుకోవచ్చు. అయితే.. సోషల్ డిస్టాన్సింగ్‌తో పాటు.. అన్ని రకాల లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు పాటించాల్సి ఉంటుంది.
మే 3 వరకూ అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేసింది. ఈ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు అనుమతి ఇచ్చారు. వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు అనుమతి ఉండదు. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మంది మాత్రమే హాజరు కావాలి. అన్ని మతాల ఆధ్యాత్మిక ప్రార్థనలపై నిషేధం కొనసాగుతుంది. పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగుపై ఎలాంటి ఆంక్షలు లేవు. అక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి ఇస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కట్ల కార్యకలాపాలకు కూడా ఈ నెల ఇరవై నుంచి అనుమతి లభిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యక్రమాలకు కూడా అనుమతి ఉంది. అయితే.. కార్మికులు పని ప్రదేశంలో నివసిస్తూ ఉంటేనే.. అనుమతి ఇస్తారు. లేకపోతే ఇవ్వరు.
వ్యవసాయ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా.. వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు అనుమతిని కేంద్రం మంజూరు చేసింది. వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించారు. రోడ్ల పక్కన దాబాలు, వాహన మరమ్మత్తుల దుకాణాలు కూడా ఇరవయ్యో తేదీ నుంచి ప్రారంభించుకోవచ్చు. సినిమా హాళ్లు, షాంపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, అన్ని రకాల క్రీడా వ్యవహారాలను నిషేధించారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరించారు. గోదాములు, శీతల గోదాములతో పాటు… ఈ కామర్స్ సంస్థలు, వాహనాలకు అనుమతి ఇస్తారు. ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌మెకానిక్స్, కార్పెంటర్ల సేవలకు అనుమతి ఇస్తారు. కార్యకలాపాలకు అనుమతించిన చోట.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పని సరి. పనిప్రాంతాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నేరమని కేంద్రం స్పష్టం చేసింది.