ఆంధ్రప్రదేశ్ కరోనాపై విజయం సాధించేసిందని విజయసాయిరెడ్డి అసలు.. కరోనా ప్రభావం ప్రారంభమక ముందే ట్విట్టర్లో గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా.. పదంటే పదే కేసులు ఏపీలో ఉన్నాయని.. అది తాము తీసుకున్న చర్యల గొప్పదనమన్నట్లుగా చెప్పారు. రెండు వారాలు కాక ముందే… ఏపీలో కేసుల సంఖ్య ఐదువందలు దాటిపోయింది. కరోనా కట్టడిలో తీసుకుంటున్న చర్యలను.. జగన్మోహన్ రెడ్డి సమీక్షల్లోతీసుకుంటున్న నిర్ణయాలను దేశం మొత్తం.. నిబిడాశ్చర్యంతో చూస్తోందని.. అనుసరిస్తోందని.. విజయసాయిరెడ్డి ప్రతీ రోజూ.. ప్రచారం చేసుకుంటూ ఉంటారు. చివరికి అందరికీ మూడు మాస్కులు ఇవ్వాలని జగన్ నిర్ణయించడాన్ని కూడా… దేశం మొత్తం ఆశ్చర్య పరిచిందని ట్వీట్ చేసేశారు. అన్ని మాస్కులు అందుబాటులో ఉంటే.. అన్ని ప్రభుత్వాలు ఇచ్చేవే. డాక్టర్లకు, పేషంట్లకు ఇచ్చేందుకు లేకనే అన్ని ప్రభుత్వాలు.. ఇబ్బంది పడుతున్నాయి. ఏపీ సర్కార్ కూ అదే సమస్య ఉంది. అయినా… ఇలా నిర్ణయం తీసుకోగానే.. అలా పదహారు కోట్ల మాస్కులు వచ్చేస్తాయని.. పంచేశామని ఊహించేసుకుని విజయసాయిరెడ్డి.. దేశం మొత్తం తమ వైపు చూస్తోందని.. సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకుననారు.
కరోనాపై ఏపీ గెలిచేసిందన్నట్లుగామొదటి నుంచి జరుగుతున్న ప్రచారం..ఇప్పటికీ ఆగలేదు. ఐదు వందల కేసులు దాటిపోయాయి. డాక్టర్లే… కరోనాకు బలవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరులో ఓ ప్రముఖ డాక్టర్.. కర్నూలులో మరో ప్రముఖ డాక్టర్ కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో ఓ రెసిడెంట్ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. చివరికి తాడేపల్లిలోని సీఎం ఇంటి సమీపంలో ఉండే వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇలా బహుముఖంగా… కరోనా ఏపీలో వ్యాప్తి చెందుతోంది. చేస్తున్న టెస్టులతో పోలిస్తే.. బయటపడుతున్న పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి.
మరో వైపు మహమ్మారి సామాజిక వ్యాప్తి జరుగుతోందన్న ఆన్న ఆందోళన అధికారవర్గాల్లో కనిపిస్తోంది. గత నాలుగు రోజుల నుంచి రికార్డువుతున్న పాజిటివ్ కేసులను పరిశీలిస్తే వైద్యుల్లో ఆందోళన ప్రారంభమైంది. కరోనా సెకండరీస్ లోకి వెళ్లిపోయిందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాంటాక్ట్ లేని వారు.. ట్రావెల్ హిస్టరీ లేని వారికి.. కూడా.. వైరస్ పాజిటివ్ వస్తోంది. దానికి కరెన్సీ నోట్లను పోలీసులు ఓ కారణంగా చెబుతున్నారు. నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అనేకమంది సెకండరీలు ఉన్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. నెల్లూరులో మరణించిన వైద్యుడికి ఎలా వైరస్ సోకిందనే విషయాన్ని పోలీస్ యంత్రాంగం ఆరాతీసే పనిలో నిమగ్నమైంది. సామాజిక వ్యాప్తి అంటూ ప్రారంభమైతే.. అది చాలా ప్రమాదకమైన పరిస్థితి.
పరిస్థితి ఇలా ఉంటే.. మొన్నటిదాకా కరోనా కట్టడిలో ఏపీ ముందు ఉందంటూ.. ప్రచారం చేసుకున్న ప్రభుత్వం.. విజయసాయిరెడ్డి వంటి నేతలు.. ఇప్పుడు.. మరణాలను తగ్గించేశామని ట్వీట్లు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే పదికిపైగా మరణాలు సంభవించాయి. కరోనా లక్షణాలతో చనిపోయినవారిని పట్టించుకోకుండా… అంత్యక్రియలు చేయించేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే… తాము కరోనాపై గెలిచామని చెప్పుకోవడానికి వైసీపీ నేతలు ఉత్సాహ పడుతున్నారు.