చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారికంగా ప్రకటించలేదు. అధికారిక ప్రకటనలో ఇంకాఎక్కువే ఉండే అవకాశం ఉంది. వీరిలో ఎనిమిది మంది పోలీసు ఉద్యోగులు ఉన్నారు. ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న పాజిటివ్ కేసుల్లో.. ఉద్యోగులవే ఎక్కువ. వీరంతా.. ఎమ్మెల్యే తరపు సహాయ సామాగ్రి పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదీ కూడా.. అట్టహాసంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో భాగమయ్యారు. శ్రీకాళహస్తిలో ఏప్రిల్ 12వ తేదీన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి… భారీ ర్యాలీ నిర్వహించారు. అప్పటికి నియోజకవర్గంలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అంటే రెడ్ జోన్ కింద లెక్క. అయినా ఎమ్మెల్యే లైట్ తీసుకున్నారు. ఆయన మాటను కాదనలేక అధికారులు జీ హుజూర్ అన్నారు. పరిస్థితి ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా.. అధికారులు… ర్యాలీకి సహకరించారు.
ర్యాలీలో సామాజిక దూరం పాటించలేదు. రెండు వేల మందికి ర్యాలీలో పాల్గొన్నా.. ఎవరికీ మాస్కుల్లాంటి రక్షణ పరికరాల్లేవు. అప్పుడే దేశవ్యాప్త దుమారం రేగింది. నేషనల్ మీడియాలోనూ హైలెట్ అయింది. ఇప్పుడు.. ఆ ర్యాలీ వల్ల ఎంత తీవ్ర నష్టం జరిగిందో.. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ర్యాలీ తర్వాత పదహారో తేదీన ఐదు, పందొమ్మిదో తేదీన 11, 20వ తేదీన 13 కేసులు నమోదయ్యాయి. ఇరవై రెండున మరో ఆరు కేసులు. వీటిలో మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఎమ్మెల్యే ర్యాలీ కార్యక్రమంలో భాగమైన వారు ఉన్నారు. దీంతో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క శ్రీకాళహస్తి మాత్రమే కాదు… రాష్ట్రంలో భారీగా కేసులు నమోదవుతున్న చోట్ల.. వైసీపీ నేతల నిర్వాకమే కారణం అన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు రెండు వందలకు చేరువగా ఉన్నాయి. అక్కడ వైసీపీ నేతలు మొదట్లో వ్యవహరించిన విధానం వల్లే ఇప్పుడు కేసులు స్థాయిలో ఉన్నాయని.. మొత్తం కర్నూలు ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరులో అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబసభ్యునికి మొదట వైరస్ బయటపడింది. బయటపడిన అనేక కేసుల్లో ఆ కాంటాక్ట్ లింకులే ఎక్కువగా ఉన్నాయి. గుంటూరులో ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉండటానికి ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వాకమేనని సులువుగా అర్థం చేసుకోవచ్చు. కొసమెరుపేమిటంటే… తమ తీరు వల్ల కరోనా పెరుగుతోందని తెలిసినా వైసీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడంలేదు. రోజా పూల స్వాగతం ఏర్పాటు చేసుకోగా.. కొండెపి ఎమ్మెల్యే రాజకీయ సభ పెట్టేశారు. ఈ నిర్లక్ష్యం ఏపీ ప్రజల్ని ఏం చేస్తుదోనన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.