ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కరోనా తమ రాష్ట్రంలోకి రాలేదని… పూర్తిగా కంట్రోల్లో ఉందని చెప్పడానికి ఇప్పటి వరకూ అవాస్తవాలు ప్రచారం చేసిందా..? ఆ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందా..? ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతున్న సమయంలో.. ఆంధ్రకు.. ఇరవై వేల మందికిపైగా విదేశీయులు వచ్చారు. చాలా రాష్ట్రాలు వారిని విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ చేస్తూంటే.. ఏపీలో మాత్రం అలాంటివారిని పట్టించుకోలేదు. కనీసం స్క్రీనింగ్ కూడా చేయలేదు. ఫలితంగా… విదేశాల నుంచి వచ్చిన వారు యధావిధిగా జనంలో కలిసిపోయారు. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా… ప్రభుత్వం నిద్రలేచినతర్వాత వాలంటీర్లతో..ఇంటింటి సర్వే చేయించి.. విదేశాల నుంచి వచ్చిన వారిని కనుక్కునే ప్రయత్నంలో పడింది.
కానీ వాలంటీర్లు ఆ పనిని సక్రమంగా చేయడం లేదు. విశాఖలో కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తిని.. వాలంటీర్లు తమ సర్వేలో గుర్తించలేకపోయారు. ఆయన హైదరాబాద్ టు విశాఖ రెండు సార్లు తిరిగారు. ఇంటి చుట్టుపక్కల వాళ్లతో కలుపుగోలుగా వ్యవహరించారు. అలాగే.. ఇరవై వేల మంది విదేశాల నుంచి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వారి వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. వివిధ రకాల డేటాలను ముందేసుకుని ఫోన్ల ద్వారా వారి ఆచూకీని కనిపెట్టేందుకు ప్రభుత్వం. .. ఓ మినీ కాల్ సెంటర్ లాంటిదాన్ని ప్రారంభించి ప్రయత్నాలు చేస్తోంది. ఇలా గుర్తించిన వారిలో కరోనా లక్షాణాలు ఉన్న వారిని ఆస్పత్రులకు తరలించి .. టెస్టులు చేయడంతో.. ఇప్పటికి వారి సంఖ్య ఐదుకు చేరింది. వీరంతా విదేశాల నుంచి వచ్చినవారే. వచ్చినప్పటి నుండి వారు.. ఎలాంటి ఆంక్షలు లేకుండా.. అందరితో కలిసిపోయిన వారే. రాజకీయ కారణాల కోసం.. ప్రభుత్వం ఏపీలో కరోనా ఉధృతిని కావాలనే లైట్ తీసుకుందున్న ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. యంత్రాంగం మొత్తాన్ని ఎన్నికలపై దృష్టి పెట్టేలా చేసి… కరోనాను లైట్ తీసుకున్నారు.
ప్రస్తుతం కరోనా కేసులు ఏపీలో ఐదు మాత్రమే బయటపడ్డాయి. దీనర్థం ఐదు మాత్రమే ఉన్నాయని కాదు. అసలు ఆంధ్ర నుంచి కరోనా టెస్టులకు వెళ్తున్నవి చాలా పరిమింత. ఇప్పటి వరకూ 120 మందికి మాత్రమే కరోనా టెస్టులు చేశారు. వీరిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. పెద్ద ఎత్తున కరోనా లక్షణాలతో.. ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వం సమస్యను గుర్తించకుండా.. నిప్పులపై దుప్పటి కప్పిందని.. ఇప్పుడా నిప్పులు దుప్పటిని కాల్చేస్తున్నాయన్న అభిప్రాయం … అంతటా ఏర్పడుతోంది.