ఢిల్లీ నుంచి వచ్చిన తబ్లిగీలందరికీ కరోనా టెస్టులు చేస్తున్న అధికారులకు షాక్ కొట్టే ఫలితాలు తెలుస్తున్నాయి. చాలా మందిలో కరోనా లక్షణాలు ఉండటం లేదు కానీ.. వారిలో వైరస్ ఉంది. టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలుతోంది కానీ… ఆ వైరస్ లక్షణాలు అయిన.. జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటివేవీ బాధితులకు కనిపించలేదు. పధ్నాలుగు రోజులు పూర్తయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏపీలో నలుగురు, ఐదుగురు తబ్లిగీల్లో ఇలా బయటపడింది. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి. కేరళలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలిన తర్వాత 19రోజుల తర్వాత ఎలాంటి లక్షణాలు బయటపడకపోగా పాజిటివ్‌గానే ఉంది. లెక్క ప్రకారం.. పధ్నాలుగు రోజుల తర్వాత వైరస్ అంతమవ్వాలి.
ప్రస్తుతం దేశంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికే టెస్టులు చేస్తున్నారు. వైరస్ సోకగానే ముందుగా జలుబు వస్తుంది. తుమ్మడం, దగ్గడం, జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఇక్కడితో ఆగకుండా ఊపిరితిత్తుల వరకూ చేరుతుంది. న్యూమోనియాకి దారి తీస్తుంది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకింది లేనిది..లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని అంతా అనుకున్నారు. కానీ.. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ వ్యాపిస్తుందని తాజా కేసులతో తేలుతోంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ వ్యాప్తి చెందే దశ అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో చాలా దేశాల్లో ర్యాండమ్ టెస్టులు జరగడం లేదు. కరోనా అనుమానితులకు మాత్రమే టెస్టులు చేస్తున్నారు.
ఇలా లక్షణాలు బయటపడని వారు.. ఇతరులతో కలిసిపోయి.. వైరస్ ను వ్యాప్తి చేస్తూనే ఉంది. కొంత మందిలో నిద్రాణంగా ఉండి.. వ్యాప్తి చెందుతున్న వైరస్.. ఆరోగ్య సమస్యలు ఉన్న ఇతరులకు చేరితే మాత్రం.. తీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. కరోనా వైరస్ కు ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ వ్యాధి సోకిన వారికి రోజురోజుకి మరణానికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. దీంతో పాటు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు త్వరగా ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షణాలు బయటపడని వైరస్‌తో ప్రపంచం మరో సవాల్‌ను ఎదుర్కోంటోంది