అమలాపురం బ్యాక్ డ్రాప్‌తో సినిమా మొదలైనా సరే, కట్ చేస్తే అమెరికాలో పాటేసుకోవాలి. ధూల్ పేట హీరో అయినా సరే – దుబాయ్‌లో ఒక్క సీన్ అయినా తీయాలి. తెలుగు సినిమా కు ఫారెన్ లొకేషన్లంటే అంతిష్టం. ఇక్కడయ్యే ఖర్చుతోనే విదేశాల్లో షూటింగ్ చేసేసుకోవొచ్చు. పైగా ఫ్రేములు రిచ్‌గా కనిపిస్తుంటాయి. కొన్ని దేశాల్లో.. షూటింగ్ చేస్తే డబ్బులు కూడా ఇస్తుంటారు. అందుకే.. ఫారెన్ లో షెడ్యూల్లు తప్పనిసరి.
అయితే ఇప్పుడు మాత్రం విదేశాల్లో షూటింగ్ అంటేనే మనవాళ్లు భయపడిపోతున్నారు. ఫారెన్‌లో షూటింగా.. అయ్యబాబోయ్, మేం రాం -అంటూ వెనకడుగు వేస్తున్నారు. దీనంతటికీ కారణం.. కరోనా వైరస్. చైనాలో కరోనా సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. ఈ వైరస్ క్రమంగా చుట్టు పక్కల దేశాలకూ పాకుతోంది. దాంతో చైనా తో సంబంధం ఉన్న అన్ని దేశాలపై టూరిజం ప్రభావం పడింది. ముఖ్యంగా సినిమా వాళ్లు షూటింగులు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. తెలుగు సినిమాకి దుబాయ్, థాయ్‌లాండ్, మలేషియాలు అడ్డా. అక్కడకు సైతం షూటింగులకు వెళ్లడానికి తెలుగు హీరోలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు భయపడుతున్నారు. పూరి జగన్నాథ్‌కు థాయ్‌లాండ్ సెంటిమెంట్ ఎక్కువ. తన సినిమాలన్నీ దాదాపుగా అక్కడే షూటింగ్ జరుపుకున్నాయి. ఫైటర్ కోసం కూడా అక్కడకు వెళ్దామనుకున్నాడు పూరి. కానీ.. ఇప్పుడు ఆ షెడ్యూల్ కాన్సిల్ చేసినట్టు సమాచారం. నాగార్జున కొత్త సినిమా వైల్డ్ డాగ్‌కి సంబంధించి అక్కడ కొంత మేర షూటింగ్ జరగాలి. కానీ ఇప్పుడు అది కాన్సిల్ అయ్యింది. స్టార్ హీరోల సినిమాలు సగానికి సగం ఫారెన్ ట్రిప్పులు కాన్సిల్ చేసుకుంటున్నాయి. కరోనా ఉధృతి ఇలానే కొనసాగితే – కొన్నాళ్ల పాటు మనకు ఫారెన్ సాంగులూ, నేపథ్యాలూ ఉండవు. మరి ఈ భయాలు ఎప్పుడు పోతాయో..?