కరోనాపై జరుగుతున్న విపరీత ప్రచారమో.. లాక్ డౌన్ కారణంగా ఏర్పడుతున్న ఒత్తిడో… జలుబు చేసినా.. తమకు కరోనా సోకిందని భయపడుతున్న ఫలితమో కానీ.. కొంత మంది ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ కనిపిస్తోంది. మూడు రోజుల క్రితం.. పశ్చిమగోదావరి జిల్లాలో దంపతులు.. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి .. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. వారి సూసైడ్ నోట్లో.. చాలా సమస్యలు ఉన్నప్పటికీ.. అందులో చివరి కారణం కరోనానే. అలాగే.. గుంటూరు జిల్లా పల్నాడులో ఓ గ్రామంలో.. హైదరాబాద్‌లో తాపీ మేస్తి పనులు చేసుకునే వ్యక్తి ఒకతన్ని.. గ్రామంలోని వారందరూ.. అనుమానంగా చూడటంతో ప్రాణాలు తీసుకున్నాడు. పలు చోట్ల.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం.. ప్రభుత్వ వర్గాలను సైతం ఆందోళనకు గురి చేస్తోంది.
మానసికంగా దెబ్బ తింటున్న కరోనా అనుమానితులు.. !
కరోనా వైరస్‌పై జరిగిన ప్రచారం.. ఒకరి నుంచి ఒకరికి సులువుగా అంటుకుంటుందని ప్రజలు నమ్ముతూండటంతో.. స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం కన్నా… ఆ కరోనా అనుమానితుడ్ని.. తమ దరిదాపుల్లో కూడా కూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఓ భార్య.. తెలంగాణలో పని చేస్తున్న తన భర్తను కూడా… కరోనా టెస్టులు చేయించుకునే ఇంట్లోకి రావాలని తేల్చి చెప్పడంతో.. వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ వివాదం బయటకు వచ్చింది కాబట్టి.. తెలిసింది.. ఇక తెలియనివివి గ్రామాల్లో చాలా ఉన్నాయి. రెండు నెలల కిందట.. విదేశాల నుంచి వచ్చినప్పటికీ… అనేక మందిని.. గ్రామాల్లో ఇళ్ల నుంచి బయటకు కూడా రానివ్వని పరిస్థితి ఏర్పడింది.
వైరస్ గురించి పూర్తిగా తెలియక సంఘ బహిష్కరణ చేస్తున్న తోటి వ్యక్తులు..!
మీడియాలో జరుగుతున్న ప్రచారం.. ప్రపంచాన్ని కబళిస్తోందన్న భయాలు… ప్రజల మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆ వైరస్ విషయంలో ఉన్న అపోహలు… ప్రజల మధ్య.. కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. గ్రామాల్లోనూ.. గొడవలకు కారణం అవుతున్నాయి. ఆ వైరస్ సోకడం అంటే.. మహా తప్పిదం చేశారన్నట్లుగా అందరూ.. చూస్తూండటంతో.. చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వచ్చినా.. ఇక తమకు తగ్గని రోగమేదో వచ్చిందని.. వారు డీలా పడిపోతున్నారు. చుట్టుపక్కల వాళ్లు ట్రీట్ చేసే విధానం మారిపోతూండటంతో… వారు మరింతగా కుంగిపోతున్నారు.
అవగాహన పెంచి.. ప్రజల మానసిక స్థైర్యం పెంచాల్సిన సమయం..!
వైరస్ వ్యాప్తి పరిస్థితులతో పాటు.. ఇలా.. ప్రజల మానసిక ఆరోగ్యాన్ని కూడా కరోనా దెబ్బ తీస్తోంది. శారీరంగా వచ్చిన వైరస్‌ను… ఏదో విధంగా నయం చేయవచ్చు కానీ.. మానసికంగా .. ఇలా వైరస్ జనం మనసుల్లోకి చొచ్చుకెళ్లిపోతే మాత్రం.. ఆ దుష్ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు వినూత్నంగా వ్యవహరించాల్సి ఉంది. కరోనాపై ఉన్న అపోహలు..భయాలను తొలగించాల్సి ఉంటుంది. లేక ముందు ముందు మరిన్ని.. ఇబ్బందికర పరిస్థితుల్ని కరోనా తీసుకొచ్చి పెడుతుంది.