లాక్ డౌన్ నిబంధనల నుంచి చిత్రీకరణలకు మినహాయింపు రావడంతో టీవీ సీరియళ్లకు ఉపశమనం లభించినట్టైంది. సినిమా షూటింగులంటే అరకొర మొదలయ్యాయి గానీ, టీవీ సీరియళ్లు మాత్రం మహా జోరుగా సాగుతున్నాయి. సోమవారం నుంచి ధారవాహికల్ని సైతం.. ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. గేమ్ షోలూ, ఎంటర్టైన్మెంట్ పోగ్రాములూ షరా మామూలే. అయితే వీటి స్పీడుకు ఇప్పుడు సడన్ బ్రేకు పడింది. ఓ టీవీ నటుడికి కరోనా పాజిటీవ్ అని తేలడంతో టీవీ రంగం ఉలిక్కి పడింది.గత కొన్ని రోజులుగా ఆ నటుడు నిరవధికంగా షూటింగుల్లో పాలు పంచుకుంటున్నాడట. దాంతో.. అతనితో కలసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఇప్పుడ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. టీవీ సీరియల్స్ అన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉపాధి కోసం టీవీ సీరియళ్లు మొదలెడితే, ప్రాణాల మీదకు వచ్చి పడుతుందని పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకునే టీవీ సీరియల్స్ షూటింగ్స్ని మొదలెట్టామని, కానీ ఇలా అవుతుందని అనుకోలేదని, ఇక మీదట మరింత జాగ్రత్తగా పనిచేయాలని, షూటింగులు నిర్వహించాలా, వద్దా అనే విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ యాదవ్ తెలిపారు.