తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు కరోనా ఫోబియా పట్టుకుంది. ఇప్పుడు ఎవరూ బయటకు రావడం లేదు. ముగ్గురికి పాజిటివ్‌గా తేలడంతో.. తామ జాగ్రత్తలో తాము ఉంటున్నారు. జనగామ, నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరందరూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. వివిధ కార్యక్రమాల్లో వీరు ముగ్గురు కలిసి మెలిసి పాల్గొనడంతోనే.. వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. వారిని కలిసిన ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల్లో భయం ప్రారంభమయింది. కొద్దిరోజుల కిందట.. ముఖ్యమంత్రి కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు ముత్తిరెడ్డి కూడా.. ముఖ్యమంత్రిని కలిశారు.
అధికార పార్టీ కావడంతో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా కాలంగా ప్రజల్లోనే ఉంటున్నారు. మొదట్లో అసలు సీరియస్‌గా తీసుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పారాసిటమాల్‌తో పోతుదంని వ్యాఖ్యానించినప్పుడు ఎమ్మెల్యేలందరూ బల్లలు చరిచి అభినందించారు. అలా సీఎంనే లైట్ తీసుకోవడం… ఎమ్మెల్యేల మనసుల్లో పడిపోయిందేమో కానీ.. లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా వారు పెద్దగా జాగ్రత్తలు తీసుకోకుండానే… రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారు. సడలింపులు ప్రారంభించిన తర్వాత అధికారికంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి తిరిగిన వారు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా.. ఈ విషయంలో టెన్షన్ పడుతున్నారు. పెద్ద ఎత్తున ఒకరి వద్ద నుంచి మరొకరికి వ్యాపిస్తూ ఉండటంతో… టెస్టులు చేయించుకోవాలంటే టెన్షన్ పడుతున్నారు. టీఆర్ఎస్ నేతల పరిస్థితి చూసి సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పారాసిటమాల్ వేసుకోమని… చెప్పడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను వైరల్ చేయడం వంటి వాటితో విపక్ష పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు హడావుడి చేస్తున్నారు. దీనిపై స్పందించలేని పరిస్థితి టీఆర్ఎస్ నేతలది.