కర్నూలు జిల్లాలో వైరస్ ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోగలిగే ఉదంతం ఇది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబసభ్యుల్లో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. కర్నూలులో ప్రముఖ డాక్టర్‌గా సంజీవ్ కుమార్ ఉన్నారు. ఆయన కుటుంబంలో అందరూ వైద్యులే. సంజీవ్ కుమార్ ఇద్దరు సోదరులు, వారి భార్యలకు వైరస్ సోకింది. వీరందరూ వైద్యులే. వీరిలో ఒకరి కుమారుడికీ వైరస్ పాజిటివ్ గా తేలింది. అలాగే సంజీవ్ కుమార్ తండ్రికి కూడా వైరస్ సోకింది. ఆయన వయసు 80 ఏళ్లకుపైగా ఉండటంతో పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లుగా చెబుతున్నారు.
వీరికి వైరస్ ఎలా సోకిందన్నది మిస్టరీగా మారింది. మర్కజ్‌కు వెళ్లిన వచ్చిన యాత్రికులు.. తర్వాత అనారోగ్యానికి గురవడంతో.. అది కరోనా వైరస్ అని తెలియక ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. అలా కర్నూలులోని ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా బాధితులు చికిత్స కోసం వెళ్లారు. ఇలా వెళ్లిన ద్వారా వారికి వైరస్ సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఇప్పటికే కరోనా కారణంగా ఓ ప్రముఖ వైద్యుడు కూడా మరణించారు. ఇప్పటికే జిల్లాలో మొత్తం 279 కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది.
తన కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకిన మాట నిజమేనని సంజీవ్ కుమార్ అంగీకరించారు. లాక్ డౌన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని.. ఆయన నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనను కూడా క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో.. ఎంపీ కుటుంబంలో ఆరుగురికి వైరస్ రావడంతోనే తెలుస్తోందని నిపుణులు అంటున్నారు. పకడ్బందీ వ్యూహంతో… వైరస్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.