ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రతినిధులకు కూడా వైరస్ అంటుకుంటోంది. అనూహ్యంగా… విజయనగరం జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యేకు పాజిటివ్‌గా తేలినట్లుగా తెలుస్తోంది. ఆయన పందొమ్మిదో తేదీ వరకూ.. అమరావతిలోనే.. ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరై.. అందరితోనూ యధావిధిగా కలివిడిగా మాట్లాడారు. ఆ తర్వాత రాజ్యసభ ఎన్నికల్లోనూ పాల్గొన్నారు. వైసీపీ హైకమాండ్ సూచించిన అభ్యర్థికి ఓటు వేశారు. ఆ తర్వాత మూడు రోజుల్లోనే… ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు.. ఆయన ప్రైమరీ కాంటాక్ట్లయిన ఇతర ఎమ్మెల్యేల్లోనూ ఆందోళన ప్రారంభమయింది.
మామూలుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ముందు.. అందరికీ పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎమ్మెల్యేలకు కాకుండా.. వారి సిబ్బందికి.. అసెంబ్లీ స్టాఫ్‌కు పరీక్షలు చేశారు. దాంతో.. ఎమ్మెల్యేలకు పాజిటివ్ బయటపడలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులకు ఇంత వరకూ పాజిటివ్ కేసు రాలేదు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఏపీలో మాత్రం.. మొదటి సారి ఎమ్మెల్యేకు వచ్చింది. వందల కేసులు నమోదవుతున్న జిల్లాల్లో కాకుండా.. కాస్త తక్కువ కేసులు ఉన్న విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేకు వైరస్ సోకడంతో.. ఎక్కడ నుంచి.. ఎలా సోకిందన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.. తాను వైరస్ సోకిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిశానని… క్వారంటైన్లో ఉన్నానని అందుకే ఓటు వేయడానికి రాలేకపోతున్నానని లేఖ పంపారు. అయితే.. వైసీపీ నేతలు.. ఇలాంటి నిబంధనలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు.. ఎమ్మెల్యే ద్వారా ఎంత మందికి సోకుతుందోనని..ఆ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీలో పలువురు కీలక నేతలు.. మాస్క్‌లు పెట్టుకోవడం నామోషీగా ఫీలవుతున్నారు. చాలా సందర్భాల్లో మాస్కులు లేకుండానే… కనిపిస్తున్నారు.