ఆంధ్రప్రదేశ్లో మరణాలు రెండు వేలు దాటిపోయాయి. గత రెండు రోజులుగా.. రోజుకు కొద్దిగా తక్కువగా వంద మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ అనేది ప్రాణాంతకం కాదని… చికిత్స చేస్తే పోతుందని ప్రభుత్వం ఎంత భరోసాగా చెబుతున్నా.. అది నిర్లక్ష్యంగా మారిపోయిన వాతావరణం కనిపిస్తోంది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి.. కరోనా ప్రాణాంతకమే. వారికి అవసరమైన చికిత్సను తక్షణం అందిచాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు మాత్రం నామ మాత్రంగా ఉంటున్నాయి. ఫలితంగా.. మృతుల సంఖ్య అనూహ్యంగా ఉంటోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అరగంటలలో రోగికి బెడ్ ఏర్పాటు చేయకపోతే.. అధికారులను బాధ్యుల్ని చేస్తానని హెచ్చరించారు. కానీ… సీరియస్గా ఉన్న కోవిడ్ రోగులు… ఆస్పత్రి బయట.. సొంతంగా ఆక్సీజన్ మాస్క్లు పెట్టుకుని గంటల తరబడి ఎదురు చూసినా బెడ్లు దొరకని పరిస్థితి. ఇప్పటికే లక్షణాలు లేని వారిని.. స్వల్ప లక్షణాలు ఉన్న వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. శ్వాస సమస్యలు.. ఇతర సమస్యలు ఉన్న వారినైనా గుర్తించి.. తక్షణం వైద్యం చేసే ప్రయత్నాలు జరగడం లేదు. అదే మరణాలకు కారణం అవుతోంది.
ఏపీ ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతూ.. వాలంటీర్లు… గ్రామ, వార్డు సచివాలాయాల వ్యవస్థను నిర్వహిస్తోంది. ప్రతి యాభై ఇళ్లను మానిటర్ చేయడానికి ఒకరు ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని .. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం ప్రభుత్వానికి క్షణాల్లో పని. అయినప్పటికీ.. సీరియస్గా ఉన్న వారికి.. వైద్య సాయం అందకపోవడం లోపంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో.. ఎక్కడా లేని విధంగా మరణాల సంఖ్య పెరగడం.. ఖచ్చితంగా.. ఆందోళనకరమే. ఈ విషయంపై తక్షణం ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే… ఏపీలో కరోనా పరిస్థితి అవుటాఫ్ కంట్రోల్ అయిపోతుంది.. జాతీయ మీడియా కూడా.. విమర్శలు చేస్తోంది.