విష్ణువు 21(ఏకవింశతి)అవతారాలు (పార్ట్ 2)
ఈ రెండవ భాగంలో..
– నారదుడు విష్ణుమూర్తి అవతారం ఎలా అయ్యారు ?
– సమస్త మానవాళికి నారదుడు మార్గదర్శిగా ఎలా మారారు ?
– నారద అవతారానికి సమాప్తి లేదా ?
– నారదుడు జర్నలిస్టులకు ఆద్యుడా !
మహావిష్ణువు యెక్క 21 అవతారాల క్రమంలో మూడవ అవతారమైన నారదులవారు మహాజ్ఞాని. బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప వక్త, మేధావి, మంచిచెడులను క్షణంలో గుర్తించగల నిపుణుడు. అందుకే నేటి కార్పొరేట్ యుగానికి కూడా ఆయనే మహా గురువు. మహావిష్ణువు అవతారమైనవాడు కనుకనే ముల్లోకాల్లోనేకాదు, సమస్త బ్రహ్మాండములందు ఎప్పుడు ఏమి జరిగినా తెలుసుకోగలిగేవాడు. బహుదొడ్డ రాజనీతిజ్ఞుడు. లోకహితవాది. అలాంటి నారదుడ్ని సినిమాల్లో కలహభోజనుడిగా చూపించడం కేవలం కథను రక్తికట్టించడానికే. ఆ `మచ్చ’ ఆయనకు ఏనాడూ ఏర్పడలేదని భాగవత, భారత, రామాయణాల్లోనేకాదు, ఎన్నో పురాణాలు, మరెన్నో ఉపనిషత్తులు చదవినవారికి అర్థమవుతుంది. వారిని కార్పొరేట్ గురువుగా భావిస్తే అఖండ విజయాలు సొంతం అవుతాయి. కెరీర్ లో ఎదుగుదల నల్లేరుమీద నడకలా సాగిపోతుంది. ప్రస్తుత సమాజం గాడితప్పకుండా ఉండాలంటే ఈ మహనీయుని బోధనలను నిత్యం స్మరించుకోవాల్సిందే.
నారదులవారిని బ్రహ్మమానస పుత్రుడని వర్ణిస్తున్నా, ఆయన సాక్షాత్తు మహావిష్ణువు సంకల్పం నుంచి ఆవిర్భవించినవాడే. కనుక, నారదులవారిని విష్ణువు అవతారంగానే భాగవతం ప్రధమ స్కంధంలో పేర్కొనబడింది. ఆయన ఏనాడూ కలహప్రియత్వాన్ని ప్రదర్శించలేదు. ఆయనలోని వాక్చాతుర్యమంతా కేవలం లోక కల్యాణం కోసమే.
నారదునిగా విష్ణుమూర్తి అవతారం ఎత్తడానికి ముందు వారికీ పూర్వజన్మ వాసన ఉన్నదని మహాభాగవతంలో చెప్పబడింది. పూర్వజన్మానికీ, నారద అవతారం ఎత్తే సమయానికి నడుమ వేయి యుగాల కాలం దొర్లిపోయింది. ఈ అనంత కాలచక్రంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు) గిరగిరా తిరుగుతుంటాయి. ఒక యుగానికీ, మరొక యుగానికీ మధ్య సంధికాలం కనీసం వంద నుంచి 400 సంవత్సరాలుగా ఉంటుందని పెద్దలు చెబుతున్నమాట. ఈ సంవత్సరాల లెక్కలన్నీ మానవ సంబంధితమైనవే. మన సంవత్సరం దేవతలకు ఒక రోజుతో సమానం. ఉత్తరాయనం వస్తేనేకానీ దేవతలకు పగలురాదు. దక్షిణాయనం వారికి రాత్రి.
నారదునిగా విష్ణుమూర్తి అవతారమెత్తడానికి ముందు వేయి యుగాల క్రిందట అతను బ్రాహ్మణుల ఇంట జన్మించాడు. చాలా చిన్నతనంలోనే విష్ణుతత్వం అబ్బింది. అతని తల్లి ఒకరింట దాస్యం చేస్తుండేది. ఒకరోజు ఆమె పాముకాటుకు మరణించడంతో, అన్ని బంధనాల నుండి విముక్తుడై అడవికిపోయి భగవత్ రూపాన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు. ఆ ధ్యానముద్రలో క్షణకాలం భగవత్స్వరూపం కనిపించింది. కానీ అంతలో అంతర్థానమైంది. అప్పుడు దివ్యవాణి `మరో జన్మలో నన్ను సంపూర్ణంగా పొందగలవు. అప్పుడు నీలో అచంచలమైన భక్తి చేకూరుతుంద’ని పల్కింది. అంతిమ సమయంలో హరినామస్మరణతో తనువు చాలించాడు. బ్రహ్మ శ్వాసలో ప్రవేశించాడు.
తర్వాత మహా ప్రళయకాలం వచ్చింది. అనంత జలరాశి మధ్యలో మహావిష్ణువు శయనించి ఉండగా, ఆయన నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ప్రకటితమయ్యారు. ఆ బ్రహ్మ శ్వాసలోనే ఉన్న బ్రాహ్మణుడు అచంచల భక్తితో ధ్యానముద్రని విడువలేదు. విష్ణువు ప్రేరణతో వేయియుగాల కాలం తర్వాత అతను బ్రహ్మ యొక్క నాసికా పుటల నుంచి అనేక మంది మునులతోపాటు ప్రకటితమయ్యాడు. అతనే నారద ముని. ఆ కారణంగానే బ్రహ్మమానస పుత్రుడయ్యాడు. యజ్ఞ వరాహడిలాగానే ఇతనూ అవతరించాడు. కనుక సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే నారద ముని. ఏ కాలమైనా, ఏ యుగమైనా భక్తి తత్వాన్ని బోధిస్తూ, సకలజీవరాశిని చల్లగా చూడటమే ఆయన పని. మరో రకంగా చెప్పుకోవాలంటే, నారద ముని గురువులకే గురువు. ఆది గురువు.
జ్ఞానబోధచేసే గురువు అవసరం ఏ యుగంలోనైనా ఉంటుంది. జీవరాశి ఉన్నంతకాలం బోధన తప్పదు. అందుకే నారద అవతారానికి సమాప్తిలేదు. రావణాసురుని వధతో రాముడి అవతార లక్ష్యం నెరవేరింది. అనంతరం రాముడు అవతారం చాలించారు. అలాగే కృష్ణుడు తన లక్ష్యం నెరవేర్చుకున్నతర్వాత అవతార సమాప్తి పొందారు. కానీ నారద మహర్షి లక్ష్యం (భక్తిని, జ్ఞానాన్ని బోధించడం) ఎన్ని యుగాలైనా కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఈ అవతారానికి సమాప్తి లేదని పెద్దలు చెబుతున్నమాట. అందుకే నారద మహర్షి ప్రతి యుగంలో ప్రకటితమై సమస్యలను పరిష్కరిస్తుంటారు.
వేద వ్యాసులవారికి భాగవతం రాయమని చెప్పింది వీరే. దేవతలకు గురువైన బృహస్పతి వంటి మహా విద్వాంసులకు కలిగే ఎన్నో సందేహాలను చిటికలో తీర్చేవాడు. ఏది న్యాయం, మరేది అన్యాయం అన్న మీమాంశ వచ్చినప్పుడు నారదులవారే తీర్పు చెప్పేవారు. ఆయన కవి, శాస్త్రవేత్త, సంగీత విశారదుడు, ధర్మమూర్తి, రాజనీతి కోవిదుడు, తత్వశాస్త్రం తెలిసినవాడు. పైగా యుద్ధవిద్యా వ్యూహ నిపుణుడు. తాను స్వయంగా యుద్ధం చేయకపోయినప్పటికీ, చెడుపై మంచి విజయం సాధించడానికి తగిన వ్యూహాలు చెప్పేవాడు. అన్నింటికీ మించి భగవద్భక్తుడు. సర్వత్రా సంచరించగలవాడు. ఆయనకు శత్రువులు లేరు. కల్లాకపటం తెలియని వాడు.
ఇన్ని సుగుణాలున్న నారదుడ్ని కలహకారకునిగా పేర్కొనడం, అలా అనుకోవడం పెద్దతప్పు. నారదునిలోని విశిష్ట లక్షణాల గురించి మనమంతా తెలుసుకోవాలి. ముఖ్యంగా నేటి యువత నారదుడ్ని తమ గురువుగా భావించాలి. ఎంతటి క్లిష్టసమయం ఆసన్నమైనా మొక్కవోని ఆత్మధైర్యంతో ఎలా ముందుకుసాగాలో నారదమహర్షి నుంచి నేర్చుకోవాలి. విజయ సోపానం వంటివారు ఆయన.
అనంత బ్రహ్మాండాలలో ఎక్కడ ఏది జరిగినా నారద మహర్షికి ఇట్టే తెలిసిపోయేది. ఈ మహత్తర లక్షణం ఉండబట్టే ఆయన్ని తొలి జర్నలిస్టు గా కూడా నేటితరం వాళ్లు అభివర్ణిస్తుంటారు. సమాచారవ్యవస్థకు ఆయనే మూలపురుషుడు. ఏది చెప్పాలి ? ఏది చెప్పకూడదు?? అన్న విచక్షణా జ్ఞానం జర్నలిస్టులు తెలుసుకోవాలి. తెలిసిందంతా చెప్పేయడమే జర్నలిజమనీ, సెన్సెషనల్ న్యూస్ ఇవ్వడమే సరైన పద్ధతని అనుకునే కుహనా జర్నలిస్టులు నారదులవారి గురించి తప్పకుండా తెలుసుకుని తమ పంథా మార్చుకోవాలి.
`నారద’ అన్న శబ్దంలోనే జ్ఞానాన్ని అందించేవాడన్న అర్థం ఉంది. ఈ జ్ఞాన బోధ కోసమే ఆయన అన్ని లోకాలు తిరిగేవాడు. కేవలం వార్తల సేకరణ కోసమని భావిస్తే తప్పే అవుతుంది. నారదుడు మహా సంఘ జీవి. నారాయణుడ్ని స్మరించని వారిలో కూడా మార్పుతీసుకువచ్చాడు. అటువంటి నారదమహర్షి సదా స్మరణీయుడు. పూజనీయుడు. మహావిష్ణు అవతారమైన నారదులవారికి భక్తితో నమస్కరిస్తూ, మరో అవతారం గురించి తరువాయి భాగంలో చెప్పుకుందాం.
– కణ్వస