హైదరాబాద్: తమిళనాడులో పెట్టుబడులను ఆకర్షించటం లక్ష్యంగా ఆ రాష్ట్రప్రభుత్వం చెన్నైలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ‘గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్’ మంచి ఫలితాలను సాధించింది. మొదటిరోజే ఒక లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టటానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిన్న ఈ మీట్‌ను ప్రారంభించారు. 1,000 మంది విదేశీ ప్రతినిధులతోసహా 5,000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. తమిళనాడును పెట్టుబడులకు స్వర్గధామంగా చేయటమే తమ లక్ష్యమని, ఇక్కడ పెట్టిన పెట్టుబడులు మంచి రాబడులనిస్తాయని జయలలిత చెప్పారు. పరిశ్రమల స్థాపనకోసం అనేక ప్రోత్సాహకాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆర్థిక రంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి తీసుకొస్తున్న మార్పులు బాగున్నాయని ప్రశంసించారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. తమిళనాడుకు సంబంధించిన అనుమతులను కేంద్రం వేగంగా పూర్తిచేసేటట్లు చూడాలని ముఖ్యమంత్రి జయలలిత నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ సదస్సుద్వారా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ మొదటిరోజే లక్ష్యం అధిగమించామని జయలలిత సంతోషం వెలిబుచ్చారు.