ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుకపై చేస్తున్న ప్రయోగాలన్నీ వికటిస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు ఓ కొత్త ఆలోచన చేసింది. అదే ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం. ఇసుకకూ ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఇంత వరకూ ఏ ఒక్కరికీ వచ్చి ఉండదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలకు వచ్చింది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా దాదాపుగా పూర్తయిందని.. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడమే మిగిలిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇసుక కార్పొరేషన్ ఏం చేస్తుందంటే… ఇసుక తవ్వకం.., అమ్మకం… వ్యవహారాలను చూస్తుందన్నమాట.
గనుల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ వివిధ రకాల పద్దతుల్లో అమ్మకాలు చేస్తున్నారు. కానీ… ఏదీ కూడా.. ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తేలేకపోయింది. ఇసుక కొరత అంతకంతకూ తీవ్రమవుతూండటంతో.. ప్రజల్లోనూ అసంతృప్తి పెరిగుతోంది. ధరలు కూడా.. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే.. రెండు, మూడు రెట్లు పెరిగాయి. ఇసుక కొరత.. నిర్మాణ రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. ఏదో విధంగా పరిస్థితిని సంస్కరించకపోతే.. రిమార్కులు పడతాయని ప్రభుత్వ పెద్దలు అంచాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇసుక కోసమే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇసుక విషయంలో ప్రయోగాలు చేశారు. మొదట .. డ్వాక్రా సంఘాలకు ఇచ్చారు. కానీ… అధికార పార్టీ నేతలే డామినేట్ చేశారు. దాంతో.. చంద్రబాబు కొత్తగా ఆలోచించి… ఉచిత ఇసుక విధానం తీసుకు వచ్చారు. ఈ విధానంలో.. రవాణా ఖర్చు మాత్రమే వినియోగదారునికి పడింది. కొంత తక్కువ ఖర్చు… విరివిగా ఇసుక లభించేది. అయితే.. వైసీపీ మాత్రం… ఇసుక దోపిడీ అంటూ.. తీవ్రమైన విమర్శలు చేసేది. అందుకే.. అధికారంలోకి రాగానే.. ఉచిత ఇసుక విధానాన్ని నిలిపివేసి ధర పెట్టింది. అప్పట్నుంచి ఇసుక కష్టాలు ప్రారంభమయ్యాయి. వాటిని ఎలాగైనా పరిష్కరించాలని.. ఇప్పుడు కార్పొరేషన్ ఆలోచన చేస్తోంది ప్రభుత్వం.