ఏపీ ప్రభుత్వం బీసీ సామాజికవర్గాలకు కార్పొరేషన్లు పేపర్లపై పెట్టింది. పార్టీ నేతలకు పదవులు పంపకం చేసింది. కానీ ఆ కార్పొరేషన్లకు పైసా నిధులు కేటాయించలేదు. సాధారణంగా కార్పొరేషన్లు అంటే.. ఆయా సామాజికవర్గాల్లోని యువతకు రుణాలకు ఇచ్చి స్వయం ఉపాధికి సహాయ పడటం కోసం. అయితే ఈ ప్రభుత్వంలో ప్రజలకు పంచే నగదునే.. కులాలవారీగా విభజించి వాటిని కార్పొరేషన్ల కింద చూపిస్తున్నారు కాబట్టి.. ఇంకేం అవసరం లేదని అనుకుంటున్నారు.
ఇప్పుడీ కార్పొరేషన్లతో కొత్త రాజకీయం ప్రారంభించేశారు. కార్పొరేషన్ల చైర్మన్లు.. ఇతర పదవులు పొందిన వారితో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సమావేశం అయ్యారు. ప్రతీ కార్పొరేషన్‌కు త్వరలో రూ. రెండు లక్షలు ఇస్తామని ప్రకటించారు. దీంతో వారు ..ఎంతో కొంతలే.. అనుకున్నారు. కానీ ఆ రెండు లక్షలతో ఏం చేయాలో కూడా .. మంత్రి చెప్పుకొచ్చారు. కుల సంఘాల నేతలను పిలిచి సన్మానాలు చేయాలట.. విందులు ఇవ్వాలట. ఇదంతా ఎందుకోసమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కుల సంఘాల నేతల కడుపు నింపి నోరెత్తకుండా చేయడానికి.
ఏపీలో బీసీ వర్గాలు.. ఈ కొద్ది కాలంలోనే దారుణంగా చితికిపోయాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్వాకం కారణంగా స్వయం ఉపాధి పథకాలు అందకపోగా.. కుల వృత్తులు కూడా పడకేశాయన్న అసంతృప్తి ఆ వర్గాల్లో కనిపిస్తోంది. గతంలో ఆదరణ వంటి పథకం ద్వారా ఇచ్చే యూనిట్లను కూడా ఈ ప్రభుత్వం ఆపేసింది. ఎలా చూసినా.. బీసీ వర్గాల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తూండటంతో.. కుల సంఘాల నేతలను మాత్రం పోషించి.. అనుకూల ప్రకటనలు ఇప్పించుకుని అంతా బాగుందని చెప్పుకునేందుకు .. కార్పొరేషన్లకు రెండు లక్షల ప్రజాధనాన్ని కేటాయించాలని నిర్ణయించారు.