జగన్ పాలనలో అవినీతి పరుల్ని ఎవర్నీ సహించి లేదని… ఎవర్నీ దగ్గరకు రానివ్వబోమని ముఖ్యమంత్రి జగన్ చెబుతూంటారు. ఇప్పుడు… చేతల్లో కూడా చూపిస్తున్నారు. కాకపోతే రివర్స్‌లో. అవినీతి ఆరోపణలు బలంగా రావడం.. ఏసీబీ, విజిలెన్స్ విచారణల్లోనూ అక్రమాలు తేలడంతో బదిలీ చేసిన దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు అంత కంటే కీలకమైన పోస్టింగ్‌ను ఏపీ సర్కార్ కేటాయించింది. రాజమండ్రి దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్‌గా సురేష్‌బాబును నియమించారు. దీంతో దుర్గగుడిలో జరిగిన విచారణల గురించి… వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత గుడిలో జరిగిన వ్యవహారాల గురించి తెలిసిన వారంతా… ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
దుర్గగుడి ఈవో సురేష్ బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారని… అన్ని రకాల విచారణల్లోనూ ఆయన అవినీతి బయటపడిందని కొద్ది రోజుల కిందట ప్రచారం జరిగింది. ఓ వైపు ఏసీబీ..మరో వైపు విజిలెన్స్.. ఇలా అన్ని రకాల విచారణ సంస్థలు.. దుర్గగుడి చెప్పుల స్టాండ్ దగ్గర్నుంచి ప్రసాదంలో లడ్డూల వరకూ అన్ని చోట్ల అవినీతికి పాల్పడ్డారని తేల్చారు. అందులో… ఈవో సురేష్‌బాబుకు కూడా ప్రధాన వాటా ఉందని నిర్ధారించారు. దీంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిజానికి అప్పుడు ఏసీబీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని.. అర్హత లేకపోయినా ఈవోగా ఆయనను తెచ్చి చేసిన నియామకం దగ్గర్నుంచి దుర్గమ్మను అడ్డం పెట్టుకుని ఎంత వెనుకేసుకున్నారో.. ఎవరెవరికి ఎంతెంత సమర్పించుకున్నారో లెక్కలు బయటకు తీస్తారని అనుకున్నారు.
కానీ.. ఏపీ సర్కార్ మాత్రం… కింది స్థాయి .. రూ. వెయ్యి, రూ. రెండు వేలు లంచాలు తీసుకునే పదిహేను మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేసేసి…అవే చర్యలని సరిపెట్టింది. అయితే తీవ్రమైన ఆరోపణలు మీడియాలో రావడంతో ఈవో సురేష్ బాబును మాత్రం బదిలీ చేసింది. మొదట దేవాదాయశాఖ రాజమండ్రి జాయింట్ కమిషనర్‌గా నియమించింది. అయితే అంత అవినీతి పరుడిని శిక్షిస్తున్నట్లుగా ప్రకటించి… ప్రమోషన్ ఇవ్వడం ఏమిటని అందరూ ప్రశ్నించడంతో అప్పటికి పోస్టింగ్ నిలిపివేశారు. కానీ ఆ పోస్టులో ఎవర్నీ నియమించలేదు. ఇప్పుడు.. ఆయనకు అదే పదవి ఇచ్చి సర్దుబాటు చేశారు.