తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతిపై కోర్టుల్లో పిటిషన్లు వేయడమే తదుపరి వ్యూహంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో మీడియ ప్రతినిధులకు నేరుగానే చెప్పారు. కేసీఆర్ అవినీతి చిట్టా తమ చేతిలో ఉందని అన్ని ఆధారాలతో తాము కోర్టుల్లో పిటిషన్లు వేస్తామని చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతిని బయటపెడతామని ప్రకటించారు. కొద్ది రోజుల నుంచి కేసీఆర్ అవినీతిపై కేంద్రం కూడా ఆరా తీస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసే వారికి టీఆర్ఎస్ ఆర్థిక సాయం చేస్తోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.
తెలంగాణలో చేపట్టిన భారీ ప్రాజెక్టులు.. చేసిన ఖర్చుపై గతంలో కేంద్రం వివరాలు కోరింది. వాస్తవానికి బీజేపీ వ్యూహం కూడా.. తమకు ఎదురు తిరిగే నేతలపై అవినీతి ఇతర కేసులతో కట్టడి చేస్తుంది. అది బీహార్ లో లాలూ దగ్గర్నుంచి తమిళనాడులో శశికళ వరకూ అదే జరుగుతోంది. అదే సమయంలో బీజేపీతో సన్నిహితంగా ఉంటారనుకున్న నేతలపై పెద్ద పెద్ద కేసులున్నా.. పెద్దగా కదలిక ఉండటం లేదు. నిన్నామొన్నటి వరకూ తెలంగాణ సీఎం కేసీార్.. కేంద్ర పెద్దలతో సన్నిహితంగానే ఉన్నారు. ఇటీవలి కాలంలోనే ఆయన బీజేపీని బద్మాష్ అంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాననంటున్నారు. ఇప్పుడు… బీజేపీ.. అవినీతి అంశాన్ని హైలెట్ చేస్తోంది.
నేరుగా కేంద్రం.. విచారణకు ఆదేశిస్తే.. దాన్ని రాజకీయం అంటారు కాబట్టి.. కోర్టుల ద్వారానే… కేసీఆర్ పైవిచారణ ప్రారంభిస్తే.. కక్ష సాధింపులు.. కుట్ర అనే వాటికి అవకాశం ఉండదని అంటున్నారు. మొత్తానికి ముందు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్కు కోర్టుల్లో పిటిషన్ల పరీక్ష ఎదురయ్యే అవకాశం ఎక్కువగానే కనిపిస్తోంది.