ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ప్రజల జ్ఞాపక శక్తిని చాలా తక్కువగా అంచనా వేస్తోంది. లేకపోతే వారి ఆలోచనా సామర్థ్యాన్ని శంకిస్తోంది. అదీ కాకపోతే.. వారు తాము చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మేస్తారనైనా అనుకుంటోంది. అందుకే.. గత ప్రభుత్వంలో తీవ్ర అవినీతి చేశారంటూ.. ఆరోపించిన .. అధికారంలోకి రాగానే రద్దు చేసిన వాటినే మళ్లీ కొనసాగిస్తున్నారు. అంతే కాదు.. అప్పట్లో అవినీతి అన్నదాని కన్నా ఎక్కువగా ఆయా సంస్థలు, వ్యక్తులు, కాంట్రాక్టర్లకు లాభాలు కలిగిస్తున్నారు. మొదటి నుంచి అదే వరుస కనిపిస్త్తోంది.. తాజాగా సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లోనూ అదే పరిస్థితి.
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయగానే.. వేదిక మీద నుంచి ప్రసంగిస్తూ.. సంప్రదాయేతర విద్యుత్ రంగంలో చేసుకున్న ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. ఆరోపించారు. అందులో ఆయన చెప్పినవి.. పాతికేళ్ల పాటు పీపీఏలు చేసుకోవడం దగ్గర్నుంచి విద్యుత్ రేటు వరకూ చాలా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పదివేల మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా పదిహేనేళ్లు పీపీఏలు చేసుకోవడానికి కంపెనీలు రావడం లేదు. దాంతో 30 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకుంటామంటూ ప్రభుత్వం బయలుదేరింది. గత ప్రభుత్వం పాతికేళ్ల పాటు ఒప్పందం చేసుకుంటనే అవినీతి అన్న వైసీపీ పెద్దలు 30 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకోవడాన్ని నీతిగా ఎలా సమర్థించుకుంటారో వేచి చూడాల్సిఉంది.
సంప్రదాయేతర విద్యుత్ రంగంలో కరెంట్ చార్జీలు రాను రాను తగ్గుతున్నాయి. అందుకే గత ప్రభుత్వం విద్యుత్ ధరలు తగ్గించాలని కోర్టుకెళ్లింది. ఇప్పుడు ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా.. స్థిర చార్జీలతో పాటు.. ఒక వేళ ఏదైనా సమస్య వచ్చి విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయినా… డబ్బులు కట్టేలా ఒప్పందం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో కన్నా ఎక్కువగా రాయితీలు ఇస్తున్నారు. వీటిని మాత్రం.. పెట్టుబడుల ప్రోత్సాహకంగా ప్రభుత్వం చెప్పుకుంటోంది.
ఒక్క సంప్రదాయేతర విద్యుత్ రంగంలోనే కాదు.. బోగాపురం ఎయిర్ పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకూ అన్నింటిలోనూ అదే వరుస. గత ప్రభుత్వం చేపట్టిన పనులను అర్థారంతరంగా ఆపేసి.. ఏడాదిన్నర తర్వాత అంత కంటే ఎక్కువకు పనులు.. ఎక్కువ రాయితీలు ఇస్తూ.. పోతున్నారు. వివిధ భిన్నమైన కారణాలు చెబుతూ.. ఆదా చేశామని చెప్పుకొస్తున్నారు. ప్రజల ఆలోచనా సామర్థ్యాన్ని తక్కువగాఅంచనా వేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.