భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ” పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్”లో భారీగా నిధులున్నాయని.. అంటే పెద్ద స్కామ్ జరిగిపోయినట్లేనని ఆరోపించారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. జీవీఎల్ వేల కోట్ల లెక్క చెబుతూండటంతో… దీనిపై ప్రజల్లోనూ ఆసక్తి పెరిగిపోయింది. అసలు ఈ పీడీ అకౌంట్లేమిటన్నదాని చర్చ ప్రారంభించింది. ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల వ్యవస్థలో ఓ సంస్కణ ఈ “పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్” . 2005లో వీటిని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, స్థానిక సంస్థలు, సివిల్ కోర్టులు వంటి వాటితో పాటు.. ఎప్పటికప్పుడు ప్రజావసరాల కోసం… చేయాల్సిన ఖర్చులను మంజూరు చేసే అధికారం ఉన్న ఓ స్థాయి అధికారులు వీటిని ప్రారంభించారు. అవసరాలను బట్టి ప్రభుత్వం వీరికి నిధుల కేటాయింపు జరుగుతుంది.
అయితే ఈ పర్సనల్ డిపాజిట్ ఎకౌంట్లు.. ఆయా అధికారుల పేర్ల మీదే ఉంటాయి. కానీ నిర్వహణ మాత్రం ఏ జిల్లాలకు ఆ జిల్లాల ట్రెజరీ కార్యాలయాలే నిర్వహిస్తాయి. అసలు పారదర్శకంగా ఖర్చులు ఉండటానికి ఈ పర్సనల్ డిపాజిట్ అకౌంట్లను.. అన్ని రాష్ట్రాల్లోనూ ఓపెన్ చేశారు. అత్యధిక మొత్తం పీడీ అకౌంట్లలో డబ్బులున్నాయని జీవీఎల్ మరో ఆరోపణ చేశారు. అలా ఉండటమే అవినీతి అన్నట్లుగా చెప్పుకొచ్చారు. నిజానికి పీడీ అకౌంట్లతో అత్యధికంగా నిధులు ఉన్నది.. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే. రాజస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన పీడీ అకౌంట్లలో రూ. 34,613 కోట్లు ఉన్నాయి. అదే మహారాష్ట్రలో రూ. 21,605 కోట్లు ఉన్నాయి. తెలగాణలో రూ. 10,873 కోట్లు ఉన్నాయి. ఇలా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు… ఆక్కడి ప్రభుత్వాల ఖర్చులకు అనుగుణంగా.. పీడీ అకౌంట్లలో నిధులు ఉంటాయి. అదంతా పాలనా పరమైన ప్రక్రియ. ఈ పీడీ అకౌంట్ల నుంచి నిధులు డ్రా చేయడం కూడా చాలా పెద్ద పని. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం తీయడానికి ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉండాలి.
ఈ పీడీ అకౌంట్లలో నిధులు ఉండటమే పెద్ద అవినీతి అన్నట్లుగా జీవీఎల్ నరసింహారావు చెప్పుకొస్తున్నారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న పీడీ అకౌంట్లలో ఉన్న నిధులు కూడా.. అవినీతికి సంబంధించినవేనా.. అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. పీడీ అకౌంట్లకు సంబంధించి ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవివరంగా సమాధానం చెప్పారు. రాజ్యసభ సభ్యుడికి.. కనీస పరిజ్ఞానం లేకపోవడం శోచనీయమన్నారు. కానీ జీవీఎల్ ఆయనను స్టాక్ మార్కెట్ బ్రోకర్గానే పరిగణిస్తున్నారు. ఆయన ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అన్న విషయాన్ని గుర్తించడానికి ఇష్టపడటం లేదు. తనకు ముఖ్యమంత్రి మాత్రమే సమాధానం చెప్పాలంటున్నారు.
ఏదో అవినీతి జరిగిందే విషయాల్లో అర్థం కాని సాంకేతిక పదాలతో ప్రజల్లోకి తీసుకెళ్తే.. చాలు.. టూజీ స్కాంలా ఏమీ లేకపోయినా.. ప్రభుత్వంపై మచ్చ పడిపోతుందని.. జీవీఎల్ ఆశ పడుతున్నట్లు ఉన్నారు. అందుకే పథకం ప్రకారం బురద జల్లుతున్నారు. రొటీన్ గా జరిగే వ్యవహారాల్లోనూ… అవినీతి అవినీతి అంటూ రచ్చ చేస్తున్నారు. మొత్తానికి విభజన హామీల విషయంలో కేంద్రంపై టీడీపీ చేస్తున్న ఒత్తిడికి ఇలా అవినీతి ఆరోపణలతో కౌంటర్ ఇవ్వాలని జీవీఎల్ శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నట్లు మాత్రం స్పష్టమవుతోంది.