సినిమా తీయడం ఎంత ముఖ్యమో..? ప్రచారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే ఆ ప్రచారం కాస్త పద్ధతిగా సాగాలి. డబ్బులు వెదచల్లకుండా ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చేయాలి? అనే విషయాలు తెలిసుండాలి. ఏ ఛానల్ కి ఎన్ని యాడ్లు ఇస్తే బాగుంటుందన్న లెక్కలు జాగ్రత్తగా గమనించాలి. ప్రొడ్యూసర్ గ్రిల్డ్ ఏర్పాటు కావడానికి ప్రధాన ఉద్దేశం అదే. కొంతమంది బడా నిర్మాతలు కలిసి ఓ గ్రిల్డ్గా ఏర్పడ్డారు. చిన్న, పెద్ద సినిమాల ప్రచారాన్ని ఓ ప్లాన్ ప్రకారం, తక్కువ ఖర్చుతో చేసుకుంటూ వెళ్లడం గ్రిల్డ్ బాధ్యత. ఇది వరకు పబ్లిసిటీ కోసం కోట్లు వెదజల్లేవాళ్లంతా గ్రిల్డ్ వచ్చాక కాస్త తగ్గారు. ఎవరికి యాడ్లు ఇవ్వాలి? ఎంతెంత ఇవ్వాలి? ఏ ఛానల్‌కి, ఏ పేపర్ కి ఎంత ఖర్చు చేయాలి? అనే విషయాన్ని గ్రిల్డ్ చూసుకుంటుంది.
అయితే ఈ గ్రిల్డ్లోనూ అవకతవకలు మొదలయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. యాడ్లు ఇచ్చినందుకు కమీషన్లు తీసుకుంటున్నారని, ఆ రూపంలో ప్రతీ సినిమాకీ ఎంతో కొంత వెనకేసుకుంటున్నారని ఇండ్రస్ట్రీలోని కొంతమంది నిర్మాతలు చెవులు కొరుక్కుంటున్నారు. బడా సినిమాకి కనీసం 2 నుంచి 3 కోట్ల వరకూ పబ్లిసిటీకి అవసరం అవుతుంది. చిన్న సినిమాలకైతే లక్షల్లో ఉంటుంది. ఎవరెంత కేటాయించినా, వీళ్లకు మాత్రం కొంత కమీషన్ ముట్టజెప్పాల్సివస్తోందట. ఆ డబ్బులు ఎటుపోతున్నాయో మరి అర్థం కావడం లేదు. తాజాగా… వెబ్ సైట్లకు ఇచ్చే ప్రకటనలపైనా అజమాయిషీ తమకే ఉండాలని నిర్మాతలపై గ్రిల్డ్ ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. వెబ్ సైట్‌కి ప్రకటనలు ఇవ్వాలా, వద్దా అన్నది ఇప్పుడు నిర్మాత ఇష్టం. దాన్ని కూడా తమ గుప్పెట్లోకి తీసుకోవాలని గ్రిల్డ్ భావిస్తోంది. ప్రొడ్యూసర్స్ గ్రిల్డ్లో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయన్న సంగతి కొంతమంది నిర్మాతల దృష్టికి వెళ్లింది. వాళ్లు కూడా దీనిపై సీరియస్‌గానే ఉన్నారు. మరి ఇంటి దొంగల్ని ఎవరు పట్టుకుంటారో చూడాలి.