ఈమధ్య పాటలే గెలుపు గుర్రాలవుతున్నాయి. సినిమా విడుదలకు ముందు పాటలు హిట్టయితే – సినిమాకి విపరీతమైన బజ్ వస్తోంది. దానికి ‘అల వైకుంఠపురములో’నే సాక్ష్యం. తమన్ పాటలు ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఆ తరవాత త్రివిక్రమ్ మ్యాజిక్ కూడా కలిసొచ్చింది. సినిమా మొత్తమ్మీద ఒక్క బ్లాక్ బస్టర్ పాటున్నా సరే, తెలియనంత మైలేజ్ వస్తోంది. అందుకే పాటల విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నితిన్ సినిమాల్లో పాటలు బాగుంటాయి. ఈసారి ఆయన మరింత శ్రద్ధ పెట్టాడు. నితిన్ తాజా చిత్రం ‘భీష్మ’. రష్మిక కథానాయిక. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలోని వాటే బ్యూటీ పాట శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమాలోనే కాదు, నితిన్ కెరియర్లోనే ఇది అత్యంత ఖరీదైన పాట అని తెలుస్తోంది. ఈ పాట కోసం భారీ సెట్లు వేశారు కళా దర్శకుడు సాహి సురేష్. పాట ట్యూన్, దానికి తగినట్టుగా స్టెప్పులు, భారీ హంగులు.. ఇవన్నీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణలని తెలుస్తోంది. రష్మిక ఈమధ్య డాన్సింగులు మొదలెట్టింది. మహేష్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లో మాస్ స్టెప్పులు బాగానే వేసింది. ఈసారి నితిన్‌తో పోటీ పడి మరీ స్టెప్పులు వేసిందట. మొత్తానికి ఈ పాట ‘భీష్మ’కు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం నమ్ముతోంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ పాట , ఏ రేంజ్లో పేలుతుందో చూడాలి.