అది కుప్పం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్. ఓ కౌన్సిలర్ లేచి తాను ఓటుకు రూ. ఐదువేలు ఇచ్చి గెలిచామని… ఏళ్లు గడుస్తున్నా.. పనులు, కాంట్రాక్టులు ఇవ్వట్లేదని వాపోయాడు. అయితే మున్సిపల్ చైర్మన్ మాత్రం అదేంటి కౌన్సిలర్ గారు.. అలా అంటారు.. మీకు మొన్ననే కదా.. రూ. ఎనిమిది వందల విలువ చేసే కాంట్రాక్ట్ ఇచ్చాం..బిల్లు కూడా ఇచ్చాం కదా అని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని … ఒక్క ఓటు కొనాలంటే అలాంటి బిల్లులు ఎన్ని రావాలో లెక్కలేసుకున్నాడో.. లేకపోతే ఆ ఎనిమిది వందలకూ లంచాలివ్వాల్సి వచ్చిందని ఫీలయ్యాడో కానీ పళ్లు పటపట కొరుక్కుంటూ ..కడుపులో ఉన్న ఆగ్రహం అంతా వెలిబుచ్చి కూర్చున్నారు.
ఆయనొక్కరే కాదు.. మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా అంతే. అప్పులిచ్చిన వాళ్లకు వడ్డీలు్ కూడా కట్టడం లేదని.. వారు ఎప్పుడు వచ్చి చెప్పుతో కొడతారో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కౌన్సిలర్లందరి వేదన అదే. అయితే మున్సిపల్ కమిషనర్ మాత్రం ప్రభుత్వం నెలకు రూ. ఇరవై వేలు మాత్రమే ఇస్తోందని.. వాటితోనే 19 మంది కౌన్సిలర్లు పనులు పంచుకోవాలని తేల్చేశారు. ఇదంతా రికార్డెడ్. వైసీపీ నేతల ఆవేదన అంతా బయటకు వచ్చేసింది. కుప్పంలో మున్సిపాలిటీని గెలిచి.. చరిత్ర సృష్టించామని చెప్పుకునే వైసీపీ ఎన్నెన్నో దారుణాలకు పాల్పడింది.. అందులో ఒకటి ఓటుకు ఐదువేలు పంచడం.
ఇప్పుడు అలా పంచిన వాళ్లు దివాలాకు దగ్గరగా ఉన్నారు. కొసమెరుపేమిటంటే్… కుప్పం మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశానికి మహిళా కౌన్సిలర్లు ఒక్కరు కూడా హాజరుకాలేదు. వారి భర్తలే హాజరయ్యారు. ఓటుకు రూ. ఐదు వేలు ఇచ్చి గెలిచామని చెప్పుకున్న రంగయ్య కూడా కౌన్సిలర్ కాదు. ఆయన భార్య కౌన్సిలర్. నేరుగా కౌన్సిల్ సమావేశంలోకి వారని ఆహ్వానించడం…. చట్ట విరుద్ధం. కానీ కుప్పం మున్సిపల్ కమిషనర్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. టీడీపీ నేతలు చెప్పే రాజారెడ్డి రాజ్యాంగంలో ఇలాగే అనుమతించాలని ఉందేమో కానీ.. వారే అధికారంగా సమావేశానికి హాజరయ్యారు.